Monday, December 23, 2024

’అగ్నిపథ్ స్కీమ్’ను కడిగిపారేసిన ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -
Priyanka Gandhi
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకుల బైఠాయింపు.

న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’ నిరసనల మధ్య, కేంద్ర తెచ్చిన కొత్త మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ స్కీమ్ సైన్యాన్ని రూపుమాపేయగలదన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన కాంగ్రెస్ సత్యాగ్రహ్‌లో ఆమె ప్రసంగించారు. నిరసనకారులు తమ ఆందోళనను శాంతియుతంగా కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు నేడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా బైఠాయింపు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆ స్కీమ్ వ్యతిరేకంగా ఇటీవల ఆందోళనలు చెలరేగాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జైరామ్ రమేశ్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, అల్కా లంబా తదితర కాంగ్రెస్ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

గద్దె మీద కూర్చున్న పెద్దలు ఎలాంటి స్కీమ్‌ను తెచ్చారంటే అది యువతను చంపేయగలదు. దేశ రక్షణకు ఉపయోగపడే సైన్యాన్ని కూడా ఈ పథకం నాశనం చేసేయగలదు అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ స్కీమ్ వెనుక ఉన్న వారి ఉద్దేశ్యాలను గుర్తించండి. మీరు ఈ ప్రభుత్వాన్ని, దాని ఉద్దేశ్యాన్ని గుర్తించండి అన్నారు. అసలైన జాతీయవాదులు, బూటకపు జాతీయవాదుల మధ్య తేడా గుర్తించండి,  ఉద్యోగం కోసం శాంతియుతంగా పోరాడండని ఆమె యువతను ఉద్దేశించి అన్నారు. “మీరు ఈ ప్రభుత్వాన్ని దించేయండి. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో దించేయండి. దేశభక్తిని చాటగలిగే, దేశ సంపదను కాపాడగలిగే, దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించగలిగే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. యువతను, పేదలను ముందుకు తీసుకెళ్లగలిగే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏది చేయాలనుకున్నా శాంతి మార్గంలో చేయండి. కానీ ఆగిపోవద్దు, అలసి పోవద్దు. ఈ దేశం మీది. దీనిని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మీదే. దేశ ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. మీ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీకు తోడుంటారు. జైహింద్‌” అని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News