సిటీ బ్యూరో: డబుల్ బెడ్ రూంఇళ్ల లబ్ధి దారుల ఎంపికతో వేలాది నిరుపేదల సొంతింటి కల నిజమైంది. సెప్టెంబర్ 2వ తేదీన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి గురువారం హైదరాబాద్ జిల్లాలోని15 నియోజకవర్గాలో 500మంది నిరుపేదల చొప్పున మొత్తం 7500మంది లబ్ధిదారులను అధికారు లు ఎంపిక చేశారు. ఇందుకు దేశంలోనే ప్రప్రథమంగా అత్యంత పారదర్శకత విధానాన్ని పాటించారు. జాతీయ సమాచారం కేంద్రం (ఎన్‌ఐసి) రూపొందించిన రాండమైజేషన్ సాప్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్ డ్రా ద్వారా లబ్ధ్దిదారులను అధికారులు ఎంపిక చేశారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్‌ఎంసి మేయర్ విజయ లక్ష్మి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమక్షంలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు.
పేదవారు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే తమ ప్రభుత్వ లక్షం మేరకు వారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. హైదరాబాద్ జిల్లా 15 నియోజక వర్గాలలో మొదటి విడతగా ప్రతి నియోజక వర్గం నుంచి 500 మంది చొప్పున 7500 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, ఈ కేటాయింపులో ఎలాంటి ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. మానవ ప్రయత్నంతో లాటరీ ప్రక్రియ కన్నా ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీ తనంతో కూడిన ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేశామన్నారు.
ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రులు అన్నారు. ఇందుకు జిహెచ్‌ఎంసి కమీషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రధాన భూమిక పోషించారని మంత్రులు అభినందనలు తెలిపారు .హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ ఐ సి సహకారంతో రాండ మైజేషన్ సాఫ్ట్ వెర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా ఈ సాఫ్ట్ వెర్ నిబద్దతతో కూడిన ప్రక్రియగా భావించ వచ్చని అన్నారు.
ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే లబ్ది దారుల ఎంపిక ఈ సాఫ్ట్ వెర్ ద్వారా జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డి ఆర్ ఓ వెంకటాచారి, ఎన్ ఐ సి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్‌లోని నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీలకు ధీటుగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను సెప్టెంబర్ 2 నుంచి శ్రీకారం చుట్టనున్నారు. లబ్దిదారులకు నయా పైసా ఖ ర్చు లేకుండా ప్రభుత్వం వీటిని పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్‌లో లక్షా ఇళ్లను నిర్మించగా ఇందులో పంపిణీ సిద్ధంగా ఉన్న దాదాపు 70 వేల ఇ ళ్లను లబ్ధ్దిదారులు అక్టోబర్ మొదటివారం నాటికి పం పిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 2న ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభంలో భాగంగా ఒకే రోజు గ్రేటర్‌లోని 8 ప్రాంతాల్లో 7500 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు.