తొమ్మిది మంది మృతి, 33 మందికి గాయాలు
జమ్ము: కశ్మీర్ లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం రోజునే పాకిస్థాన్ లష్కరే తొయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టిఆర్ఎఫ్) పర్యాటక బస్సుపై దాడి చేసింది. ఇలాంటి మరిన్ని దాడులకు కూడా పాల్పడతామని హెచ్చరించింది. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణో దేవీ ఆలయానికి వెళుతున్న బస్సపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు.
డ్రైవర్కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘలనలో తొమ్మిది మంది మరణించగా, 33 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ తో పాటు కండక్టర్ కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.
ముఖాలు కప్పుకున్న ఆరేడుగురు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. బస్సు లోయలో పడిపోగా మళ్లీ కాల్పులు జరిపారు. కానీ బతికి ఉన్నవారు కూడా చనిపోయినట్లు మౌనంగా ఉండిపోవడంతో వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానికులు, పోలీసులు వచ్చి ప్రాణాలతో ఉన్నవారిని కాపాడారని బాధితులు తెలిపారు. పోలీసులు, ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉగ్రవాదులు రియాసీ, ఉధంపూర్, పూంచ్, రాజౌరీ ప్రాంతాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నారు.