Monday, December 23, 2024

రైతుల బలవన్మరణాలకు కారణాలు

- Advertisement -
- Advertisement -

దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే మేధావులు, జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరు కాదన్నా, ఔనన్నా భారత దేశం వ్యవసాయక దేశం. 68% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి వున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నేడు కూడా 14.5% వాటా కలిగి వుంది. 2020 లెక్కల ప్రకారం దేశ మొత్తం కార్మికుల్లో 41.48% వ్యవసాయ కూలీలుగా వున్నారు. భారత దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 12% రైతుల ఆత్మహత్యలు వున్నాయి. దాదాపు 68%మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి, రైతులు బలవన్మరణాల పాలు కావడానికి కారణమేమిటి? ఆ కారణాలు తెలిసినప్పుడే సంక్షోభ మూలాలు అర్ధమవుతాయి.

బ్రిటీష్ వలస పాలకుల నుండి అధికారాన్ని చేతులు మార్చుకున్న దేశీయ పాలకులు సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు, విదేశీ గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలు అధికార మార్పిడితోనే ప్రారంభించారు. దేశీయ బడా బూర్జువా వర్గం సామ్రాజ్యవాదానికి దళారీవర్గంగా వలస పాలన దగ్గర నుంచి నేటి వరకు పని చేస్తూనే వుంది. దేశానికి వెన్నెముకగా వున్న వ్యవసాయ రంగాన్ని దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించడానికి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. 1951 సెప్టెంబర్ 27 న వ్యవసాయ శాఖ నిర్వహించిన సదస్సు లో దేశంలోని భూములు, పంటలు, వాతావరణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడానికి కార్యక్రమం రూపొందించారు. ప్రతి గ్రామంలోని ప్రతి చెలకను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత అవసరమని గుర్తించారు. భారత దళారీ పాలకులు అలాంటి విధానాలు అమలు జరపకుండా సామ్రాజ్యవాదుల ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలు ప్రవేశపెట్టారు. అమెరికా నమూనా వ్యవసాయాన్ని భారత దేశంలో ప్రవేశపెట్టటానికి అమెరికా ఫౌండేషన్లు, అమెరికా ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ముఖ్యమైన పాత్రను నిర్వహించాయి.

వ్యవసాయ విస్తరణలోనూ 1952 నుండి పోర్డ్ ఫౌండేషన్ పని చేసింది. భారత వ్యవసాయానికి సరికొత్త రూపం ఇవ్వడానికి 1953 నుండి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ పని చేసింది. 1905లో ఏర్పాటైన భారత వ్యవసాయ పరిశోధనా సంస్థను 1958లో పునరుద్ధరించారు. 1965 లో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్‌కు భారత శాస్త్రవేత్త స్వామినాథన్ డీన్ గా ఎన్నికయ్యారు. భారతీయులను అమెరికన్ సంస్థలకు పంపించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని రాక్ ఫెల్లర్ సంస్థ అందజేసింది. ఇలా వెళ్ళినవారు అమెరికా వ్యవసాయ విధానాలను ప్రచారం చేయాలి. మూడవ ప్రపంచ దేశాలకు చెందిన రైతులు, శాస్త్రవేత్తలు తమ వ్యవసాయాన్ని మెరుగుపర్చుకోగలిగే సామర్థ్యం లేని వారుగా రాక్ ఫెల్లర్ శాస్త్రవేత్తలు అవమానించారు. ఆ విధంగా భారత వ్యవసాయ రంగపై అమెరికా ఆధిపత్యానికి పునాదులు పడ్డాయి. భారత పాలకులు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన విత్తనాలు అభివృద్ధి చేసి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించేందుకు రైతులను ప్రోత్సహించే విధానాలు చేపట్టలేదు. అమెరికా నుండి ఆహార ధాన్యాల దిగుమతికి ప్రాధాన్యతనిచ్చారు. దానిపై ఆహార ధాన్యాలకు ఆధారపడ్డారు. ఫలితంగా దేశం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. దాని నుండి బయటపడడానికి పిఎల్ 480 ఒప్పందం ద్వారా అమెరికా నుండి ముక్కిపోయిన గోధుమలను దిగుమతి చేసుకున్నారు.

తమ కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం కోసం ప్రపంచ బ్యాంక్ ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు హరిత విప్లవాన్ని ప్రారంభించామని భారత ప్రభుత్వంపై అమెరికా వత్తిడి చేయించింది. 1967 -68 లో అధికారికంగా భారత దేశం హరిత విప్లవాన్ని ప్రారంభించారు. విదేశాల నుంచి హైబ్రీడ్ విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల నివారణకు పురుగు మందులు దిగుమతి అయ్యాయి. హరిత విప్లవానికి ముందు వ్యవసాయోత్పత్తులు అంత తక్కువగా ఏమీ లేవు. హరిత విప్లవంలో ప్రవేశించినా విత్తనాల వల్ల ఉత్పత్తులు విపరీతంగా పెరిగిందీ లేదు. హరిత విప్లవం ద్వారా కొద్ది దిగుబడి పెరిగినా అంతకన్నా ఎక్కువగా పంట ఖర్చులు పెరిగాయి. దేశీయ విత్తనాల అభివృద్ధి ఆగిపోయింది. రసాయనిక ఎరువుల వాడకంతో భూమి గుల్లబారి సారం కోల్పోయింది.

2014 ఎన్నికల ప్రచారంలో మోడీ రైతుల గురించి అన్న మాటలు గమనిద్దాం. మన రైతులను ఉచ్చులోకి నెట్టగూడదు. రైతులు భారీ రుణాలు తీసుకోగూడదు, షావుకారు తలుపులు తట్టాల్సిన అవసరం లేదు. రైతుల రుణాలు రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా రైతుల పరిస్థితి మెరుగుపడితే వారికే కాకుండా పొలాల్లో పని చేసే చాలా మందికి ఉపాధి ఇస్తుంది. ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపుచేస్తానని చెప్పిన మోడీ, అందుకు చర్యలు తీసుకోలేదు. దేశంలోని రైతులపై సగటు రుణభారం రూ. లక్షకు పైగా వుంది. రుణమాఫీ దేశానికి నష్టం అన్నాడు. రైతులను బడా వ్యాపారుల చేతుల్లో పెట్టే విధంగా మూడు వ్యవసాయ చట్టాలు చేశాడు. వాటిని రైతాంగం వీరోచితంగా తిప్పికొట్టారు. పాలకుల విధానాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల బలవన్మరణాలు నిరంతరం పెరుగుతూనే వున్నాయి.

ప్రధాని మోడీ పాలనలో ఇంకా ఎక్కువయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో, భారత హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం 1950 నుండి ఆత్మహత్యల గణాంకాలను నివేదికగా సేకరించి ప్రచురిస్తున్నది. వీటి లెక్కల్లో వెలుగులోకి రానివి చాలా వుంటాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ప్రకారం 1995 -2014 మధ్య 2,96,438 మంది రైతులు బలవన్మరణాలకు గురయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 60,750 మంది రైతులు ఈ జాబితాలో వున్నారు. 2010-11లో 15,964 మంది రైతులు బలవన్మరణాలకు గురైనారు. 2001 నుండి ప్రతి సంవత్సరం 15 వేల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువ మంది 30 నుండి 59 సం॥ మధ్య వయసు గలవారే. ఆత్మహత్యలకు అత్యంత ప్రభావితమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్. సరళీకరణ తర్వాత 30 సంవత్సరాల్లో 3 లక్షల, 50 వేల మంది రైతులు బలవన్మరణాలకు గురైనారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో రోజూకి 30 మంది రైతులు బలవన్మరణాల పాలై మొత్తం లక్షా 474 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 33 లక్షల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో రైతాంగం ఆత్మహత్యలకు కారణాలను జర్నలిస్టులు, వ్యవసాయ నిపుణులు చెబుతున్న విషయాలు ఇలా వున్నాయి. ఉత్సాప్రట్నాయక్, జయంతి ఘోష్, ప్రభాత్ పట్నాయక్ వంటి ఆర్థికవేత్తలు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణకు అనుగుణమైన ఆర్థిక విధానంలో మార్పులే రైతుల ఆత్మహత్యలకు కారణమని చెబుతున్నారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు సమూహాలు, అధ్యయనాలు ఖరీదైన జన్యుపరంగా మార్పుచెందిన పంటలు రైతుల బలవన్మరణాల మధ్య వున్న సంబంధాన్ని పేర్కొన్నాయి. బిటి విత్తనాలు సాధారణ విత్తనాలకంటే ఖరీదు రెండు రెట్లు ఎక్కువ. అధిక ఖర్చుల కారణంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం రైతుల మరణాలకు కారణాలని చెబుతున్నాయి. దేశంలో రైతుల బలవన్మరణాలు ఆగాలన్నా, రైతుల వ్యవసాయం సజావుగా సాగాలన్నా,

దేశ వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాదుల జోక్యాన్ని అరికట్టాలి. విదేశీ బిటి, హైబ్రీడ్ విత్తనాల స్థానంలో దేశీయ విత్తనాలను అభివృద్ధి చేయాలి. అన్ని రకాల పంట ఖర్చులను లెక్కించి దానిపై 50% పెంచి మద్దతు ధర ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించాలి. ప్రభుత్వ సంస్థలే రైతుల నుండి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలి. ఎరువులు, విత్తనాలు, డీజిల్ సబ్సిడీలు ఎక్కువగా పెంచాలి. ప్రభుత్వాలు 4 శాతానికే రైతుల అవసరం మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని యావన్మంది రైతాంగం ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News