మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ
ఛాత్ర(జార్ఖండ్): బొగ్గు కొరత విషయంలో బాధపడాల్సిందంటూ ఏమీ లేదని కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. కొన్ని బొగ్గు గనులు మూసేయడం, వానాకాలంలో మరికొన్ని గనులు మునిగిపోవడం వల్ల బొగ్గు నిల్వలు తగ్గాయని, బాధపడాల్సిందంటూ ఏమీ లేదని, పరిస్థితి చక్కబడుతోందని ఆయన తెలిపారు.
జార్ఖండ్‌లోని ఛాత్ర జిల్లాకు చెందిన పిపార్వర్‌లో ఉన్న సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(సిసిఎల్)కు చెందిన అశోక గనిని ఆయన సందర్శించారు. దేశంలోని విదుత్ ఉత్పత్తి కేంద్రాలకు కావలసినంత బొగ్గు అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. “ పరిస్థితి చక్కబడుతోంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ ఇప్పుడున్న బొగ్గు పరిస్థితిపై సిసిఎల్ అధికారులతో చర్చించారు. “రోజుకు 20లక్షల టన్ను బొగ్గును మేము ఉత్పత్తిచేయగలం” అని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి ఉందని కూడా ఆయన అన్నారు. మంత్రి చర్చల సందర్భంగా గనులకు కావలసిన భూమి సంబంధిత విషయాలను కూడా చర్చించారు. జిల్లా అధికారులు సహా అందరి సహకారంతో ఓ పరిష్కారం కనుగొనగలమని ఆయన అన్నారు.