Monday, December 23, 2024

లోప పోషణ బాల్యానికి శాపం

- Advertisement -
- Advertisement -

పిల్లలు ఏం తింటున్నారు? ఎందుకు ఇంతలా గిడసబారిపోతున్నారు? వయస్సుకు తగిన బరువు, ఎత్తు లేకుండా రకరకాల వ్యాధుల బారినపడుతున్నారెందుకు? ఈ ప్రశ్నలన్నింటికీ పాలకుల ముందు ‘పోషకాహారం’ ప్రధాన సమాధానంగా నిలుస్తోంది. పిజ్జాలు, బర్గర్‌లు, చైనీస్ వంటకాలు తదితరమైన వాటిని మధ్యతరగతి పిల్లలు కోరుకుంటుండగా; సద్దనం, పచ్చడి తదితరమైనవి మురికివాడల పిల్లలకు అందుతున్నాయి. ఈ తినే ఆహార పదార్థాలలో పోషకాలు ఏమేరకు ఉంటున్నాయన్నది మన ముందున్న ప్రశ్న. పోషకాహార లోపమే పిల్లల ఎదుగుదలని అడ్డుకుంటోంది. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. శిశువు పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు చిన్నారులకు ఆమోదయోగ్యమైన ఆహారం ఇవ్వడంలో తల్లిదండ్రులకు అవగాహన కొరవడి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నారు. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను సరైన పద్ధతిలో తినిపించడం లేదు. దీంతో 2 నుంచి 19 ఏళ్లలోపు చిన్నారులు ఎదగలేకపోతున్నారు.

విటమిన్లు, ఐరన్ లోపంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బాల్యం నుంచి కౌమారదశ వరకు ఎదుగుదల, బలం చాలా అవసరం. దీంతోనే జ్ఞానం, చురుకుదనం అందుతుంది. సాధారణంగా ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయస్సులో పిల్లలు అత్యంత వేగంగా ఎదుగుతారు. పేదరికం కారణంగా ఈ కాలంలో సరైన పోషకాహారం అందని దయనీయ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది.మన రాష్ర్టంలో ఏడు నెలల నుంచి ఆరేళ్ల వయస్సున్న పిల్లల్లో 6 శాతం మంది పోషకాహార లోపం తో బాధపడుతున్నట్లు తెలంగాణ రాష్ర్ట ప్రణాళిక సంఘం వెలువరించిన ‘తెలంగాణ స్టేట్ స్టాటికల్ అబ్‌స్ట్రాక్ట్2022’ నివేదిక తెలిపింది. దీంతో ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య 19.79 లక్షలుండగా, వీరి లో 1.20 లక్షల మంది పోషకాహార లోపంతో, 20 వేల మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేల్చింది. 2022లో తెలంగాణ వ్యాప్తంగా 21.03 లక్షల మంది పిల్లల పేర్లను అనుబంధ పోషణ కార్యక్రమంలో నమోదు చేశారు. మొత్తం 33 జిల్లాల్లో 13 జిల్లాల్లో పోషకాహార లోపం తీవ్ర సమస్యగా ఉంది. ఈ జిల్లాల్లో సగటున 2 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నారు.

ముఖ్యంగా మెదక్‌లో 3.75 శాతం, ములుగులో 3.56 శాతం, మహబూబ్‌నగర్‌లో 3.06 శాతం చిన్నారుల్లో ఈ సమస్య ఉంది. ఆకలి, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి లో మహిళలు, పిల్లలు అత్యధికంగా ఉన్నారు. ఆకలి బాధకు సరైన పరిష్కారం అర్హులందరికీ పని కల్పించడం. అదే విధంగా ఆహార పంపిణీ, సమతుల ఉత్పత్తిని రెండింతలు చేయ డం, ఆహార ధాన్యాలను సక్రమంగా సరఫరా చేయడమే సమస్యలు తొలగించే మార్గం. సమతుల పోషకాహారం అందించడంపై కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)’ ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా పోషకాహార లోపాలున్న జిల్లాలను గుర్తించి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రక్తహీనత, తక్కువ బరువు ఉన్న పిల్లలకు, గర్భిణులకు పోషకాహారం అందించడం ఎన్‌ఎన్‌ఎం లక్ష్యం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా అములు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అంగన్‌వాడీలు ప్రధానమైనవి.

కేంద్ర, రాష్ర్ట రిసోర్స్ సెంటర్లు, రాష్ర్ట ప్రాజెక్టు పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, వీటికి నోడల్ అధికారులను నియమించారు. అంగన్‌వాడీలలో పిల్లలకు పోషకాహారం ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు.అయినప్పటికీ ఇంకా మన దేశంలో ఆకలి సమస్య, పోషకాహార లోప సమస్యను ఎదుర్కోలేకపోతోంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరేళ్లలోపు పిల్లల ప్రయోజనార్థం వేర్వేరు పేర్లతో అమలవుతున్న అనేక పథకాలను ఏకం చేసి ఉమ్మడిగా ఎన్‌ఎన్‌ఎం అమలుకు చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందిరావడం లేదు. పుట్టిన శిశువు బరువు కనీసం 2.4 కిలోలు ఉండా లి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ మన రాష్ర్టంలో చాలా జననాలు తక్కు వ బరువుతో నమోదవుతున్నాయి. గర్భస్థ సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడంతో తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు. కొందరు మూడు పూటలు ఆహారం తీసుకుంటున్నా, ఒకే రకం పోషక విలువలున్న పదార్ధాలు తీసుకుంటుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటోంది. ఇక పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి.

తల్లిదండ్రులు ఈ విషయంపై అంతగా శ్రద్ధ కనబరచకపోవడం వారి పిల్లలపై దీర్ఘకాలికంగా దుష్ఫలితాలకు కారణమవుతోంది. శరీరానికి అవసరమైన మరమ్మత్తు చేసే ప్రొటీన్లు ఎప్పటికప్పుడు తీసుకునే ఆహారంలో అవసరమవుతోంది. వ్యక్తి తన బరువులో కిలోకి ఒక గ్రాము చొప్పున తప్పనిసరిగా తీసుకోవలసి వుంటుంది. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు వయస్సును బట్టి ప్రొటీన్లతో కూడిన భోజనం అందించాలి. సమతుల్య ఆహారం అందిస్తే అదనంగా ప్రొటీన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారిలో ప్రొటీన్లు తగ్గిపోతాయి. అప్పుడు అదనంగా ప్రొటీన్లు అవసరమవుతుంది. పిల్లల్లో ఎక్కువ మంది విటిమన్ ఎ, విటమిన్ బి లోపంతో ఉంటున్నారు. వీటి లోపంతో బరువు తక్కువై శరీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుంది. కేంద్ర నాడీమండలం చురుగ్గా పనిచేయాలంటే విటమిన్ బి కీలకమైంది. ఇది లోపిస్తే నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. విటమిన్ ఎ లోపం కంటిచూపును దెబ్బ తీస్తుంది. చురుకుదనం కొరవడి బలహీనంగా ఉంటారు.

విటమిన్లు, ఎంజైవ్‌ులు జీర్ణక్రియను పెంపొందిస్తాయి. సాధారణంగా శిశువుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకూ తల్లిపాలుతప్ప మరేవీ పట్టకూడదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) స్పష్టం చేసింది. అలాకాకుండా బిడ్డకు తేనె పీకలు, గ్లూకోజ్ నీళ్లు పట్టేసి శిశవు జీవనసరళిని దెబ్బ తీస్తున్నారని తెలిపింది. ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు అదనంగా పోషకాలు అందించాలి. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకూ తల్లి పాలతో పాటు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినిపించాలి. క్రమేణా పిల్లల ఆహారాన్ని పెంచుతూ, ఆటపాటలతోసాగేలా జాగ్రత్తపడాలి. పదేళ్ల వయస్సు తర్వాత పాలు, గుడ్లు, మాంసకృత్తులు అందేలా చూడాలి. యుక్తవయస్సు వచ్చే వరకూ అన్ని రకాల ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. మాంసకృత్తులు, నాణ్యమైన ఆహారం… అంటువ్యాధుల బారినపడకుండా కాపాడుతూ, వయస్సుకు తగ్గ ఎత్తు బరువు సమకూరుతుందని ఎన్‌ఐన్ తెలిపింది.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News