ప్రభావవంతమైన అమెరికన్- కెనడియన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్ర్బైత్ పేరు మీద వార్షిక అవార్డును కెనడాలోని మాంట్రియల్లో 2003లో ప్రారంభించబడింది. పరిశోధన, విద్య, ప్రజాసేవలో సాధించిన విజయాలతో రాజనీతిజ్ఞతతో స్కాలర్ షిప్‌ను ఏకీకృతం చేసే జాన్ కెన్నెత్ గాల్‌బ్రైత్ పురస్కారాన్ని అసమానమైన విజయాలు, స్ఫూర్తి, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రపంచానికి సేవ చేస్తూ మేధో నాయకత్వ రికార్డును కలిగి ఉన్న పండితులు, అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తలు ప్రపంచ మానవాళికి చేసే గణనీయమైన కృషికి గౌరవప్రదంగా ఈ అవార్డుని ప్రముఖంగా తీసుకు వచ్చారు. ‘ఆవిష్కరణలు, నాయకత్వం, పరిశోధన, సేవ ద్వారా మానవాళికి చేసిన విశిష్ట సేవలకు’ గుర్తింపుగా ఈ గాల్‌బ్రైత్ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
డెవలప్‌మెంట్ ఎకనామిస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ జయతి ఘోష్‌ను 2023 సంవత్సరానికి గాను అగ్రికల్చరల్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ అసోసియేషన్ (ఎ.ఎ.ఇ.ఎ) వారు వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో అందజేసే ప్రతిష్ఠాత్మకమైన జాన్ కెన్నెత్ గాల్‌బ్రైత్ అవార్డును ప్రదానం చేయడం హర్షణీయం. మార్చి నెలలో ప్రకటించిన ఈ అవార్డును అధికారికంగా 2023 జులై 25 నాడు ఆమెకు ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రారంభించినప్పటి నుండి అందుకున్న ముగ్గురు భారతీయ లేదా భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్తలలో ఆమె ఒకరు కావడం గమనార్హం.ప్రొఫెసర్ జయతి ఘోష్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) నుండి ఆర్థిక శాస్త్రంలో దాదాపు 33 సంవత్సరాలు జెఎన్‌యు సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం యుఎస్‌ఎలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆమె అనేక ఇతర విద్యా సంస్థలలో కూడా బోధనని కొనసాగిస్తున్నారు.
2004 సెప్టెంబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ జయతీ ఘోష్ అధ్యక్షతన కమిటీని నియమించింది. సాగుదారులను గుర్తించి వ్యవసాయ సాగు రుణాలు పెంచడం, నీటి సమస్యని పరిష్కరించడం వ్యవసాయ సేవలని పెంచడం, గిట్టుబాటు ధరలు కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలతో కనీసం 100 రోజుల పనిని కల్పించడం, పేదలకు పోషకాలు అందించడం, ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచి తద్వారా ఈ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటే గ్రామీణుల జీవన వ్యయం మెరుగుపడుతుంది అని ఈ కమిటీ ప్రధాన సిఫారసులు చేసింది. ప్రొఫెసర్ జయతి ఘోష్ 2010 లో ఇటలీలోని సాంఘిక శాస్త్రాలకు నోర్డ్‌సుడ్ ప్రైజ్‌ను, 2011లో అంతర్జాతీయ కార్మిక సంస్థ డీసెంట్ వర్క్ రీసెర్చ్ ప్రైజ్, సామాజిక శాస్త్రాలకు విశిష్ట సేవలందించినందుకు 2015లో ఆదిశేషయ్య అవార్డులను అందుకున్నారు.
అలాగే ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను అందుకొని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. భారత ప్రభుత్వ నోట్ల రద్దు పతనం, అనధికారిక ఆర్థిక వ్యవస్థలో మహిళా కార్మికుల దుస్థితి, భారత దేశంలో కోవిడ్- 19 మహమ్మారి పతనం సహా అనేక రకాల విషయాలపై ఆమె అనేక పరిశోధనా పత్రాలు, పుస్తకాలను రాశారు. ముఖ్యంగా ఆమె కార్మికులు, మహిళలు, అభివృద్ధి ఆర్థిక శాస్త్రంపై అనేక వ్యాసాలు, 20కి పైగా పుస్తకాలను రచించారు. వామపక్ష భావాలు గల ఆమె పని విధానం, పరిశోధన, రచనలు అన్ని మానవ కేంద్రీకృత ఆర్థిక శాస్త్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తాయి. జయతి ఘోష్ పని కార్మికుల దుస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి సామాజిక రక్షణ కల్పించడంపై అనేక విధాన సిఫార్సులు చేశారు. పేదలకు ఉద్దేశించిన చర్యలను, మెరుగైన ఆర్థిక చేరికలు, విస్తరించిన సామాజిక రక్షణలు, ప్రాథమిక సేవలు, క్రియాశీల లేబర్ మార్కెట్ విధానాల పబ్లిక్ సదుపాయాల వంటి చర్యలను ఘోష్ సిఫార్స్ చేశారు.మూడవ ప్రపంచ దేశాల రుణ సంక్షోభం శ్రామిక ప్రజలపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల ఆమె తీవ్రంగా ఆందోళన చెందారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం లేదా తన స్వంత ఆస్తులు, ఆదాయాన్ని పొందడం అనేది అనేక స్థాయిలలో స్థితిని నిర్ణయిస్తుంది అని, ఒక మహిళ ఆర్థికంగా ఆధారపడినంత కాలం ఆమె ఇతర సామాజిక మార్గాల్లో లొంగిపోవలసి ఉండడంపై ఆమె ఆందోళన చెందారు.
2021లో కోవిడ్ -19 అనంతర ప్రపంచంలోని సామాజిక -ఆర్థిక సవాళ్లకు ప్రతిస్పందించడానికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కి సిఫార్సులను అందించే ఉన్నత స్థాయి సలహా బోర్డుకి నియమించబడిన 20 మంది ప్రముఖ వ్యక్తులలో జయతి ఘోష్ ఒకరుగా ఉండడం గమనార్హం. 2022 మార్చిలో ఆమె ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ సహకారం కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్థాపించిన ప్రతిభావంతమైన బహుపాక్షికత ( ఎఫెక్టివ్ మల్టీలెటరలిజం)లో ఉన్నత- స్థాయి సలహా మండలికి నియమించబడ్డారు. జయతి ఘోష్ అత్యంత గౌరవనీయమైన భారతీయ ఆర్థికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఆమె నాటి నుండి నేటి వరకు ఆర్థిక శాస్త్ర రంగానికి ముఖ్యంగా అభివృద్ధి ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచీకరణకు సంబంధించిన రంగాలలో గణనీయంగా కృషి చేస్తూనే ఉన్నారు. అంతిమంగా ఈ గాల్‌బ్రైత్ అవార్డ్ ఆమె ఆర్థిక శాస్త్ర పరిశోధనని మరింతగా ముందుకు కొనసాగించడానికి దోహదం చేస్తుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
* జె.జె.సి.పి. బాబూరావు- 94933 19690