దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది. ఐటి, ఫార్మా రంగాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి పరిస్థితులు హైదరాబాద్‌ని మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024’ పేరుతో విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 564వ స్థానంలో ఉంది.
గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అగ్ర నగరాల జాబితాలో ఢిల్లీ గ్లోబల్ ర్యాంక్ 350 సాధించింది. ఇండియాలో తొలిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఈ జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. స్వతంత్ర ఆర్థిక సలహా సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ర్యాంక్ ఇచ్చిన భారతదేశంలోని టాప్-10 నగరాల జాబితాలో హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. ఎకనామిక్స్, హ్యూమన్ క్యాపిటల్, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన అనే నాలుగు అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ రూపొందించబడ్డాయి. నాలుగు ఇండెక్స్‌లో హైదరాబాద్ ఎకనామిక్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరించింది.