Thursday, January 23, 2025

భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!

- Advertisement -
- Advertisement -

నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన దేవాలయాన్ని నిర్మించాక రష్యా ప్రజలకు అది మూడవ రోవ్‌ు నగరంలా తయారైందని పాస్కోవ్ అనే సాధు రచయిత రాశాడు. ఈ పవిత్రమైన దేవాలయాన్ని పూర్తి చేయడానికి 45 సంవత్సరాలు పట్టింది. మూడవ అలెగ్జాండర్ జార్ చక్రవర్తి కాలంలో 1883 మేలో దాన్ని పవిత్రం చేశారు. కళాత్మకంగా చూస్తే ఇదొక మహత్తర ‘దివ్య భవ్యమైన’ ఆలయం. ముప్పై అంతస్తుల ఎత్తైన శిఖరం పైన సుందరమైన చిత్రాలను చిత్రించారు. దీనికి అమర్చిన గంట 24 టన్నుల బరువుంటుంది. దీనికి 422 కిలోల బంగారాన్ని ఉపయోగించారు.

ఆలయం లోపల వెండి, బంగారంతో పాటు, రత్నాలను పొదిగి నగిషీలు చెక్కారు. రష్యాలో బోల్షివిక్ విప్లవం 1917లో విజయవంతం కావడంతో జార్ చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యులు అజ్ఞాతంలో కెళ్ళిపోయి, అక్కడ హత్యకు గురయ్యారు. రష్యాలో సర్వాధికారాలు గల నాయకుడుగా ఏర్పడిన స్టాలిన్ ఈ ఆలయం నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించాడు. రాత్రికి రాత్రి ఈ ఆలయం హద్దులు చెరిగిపోయి, చుట్టూ ముళ్ళ కంచె ఏర్పడింది. ఆలయం విధ్వంసం తరువాత అబ్బురపరిచే ఆలయం కాస్తా అదృశ్యమైపోయి, శకలాలు మాత్రం మిగిలాయి. ఆ ఆలయ గోడలకున్న వెండి, బంగారం, వెల్వెట్ వస్త్రాలు, రత్నాలన్నీ ముందుగానే తొలగించారు. ఆలయాన్ని నిర్మించడం, కొంత కాలానికి అది నేలమట్టం కావడం, చాలా కాలానికి దాన్ని పునర్నిర్మించడం అనేది ప్రపంచంలో జరిగిన సుదీర్ఘ చరిత్ర.

తాజాగా అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం కూడా ఈ సుదీర్ఘ కాలచక్రంలో అలాంటిదే. రాముడు కంటే ముందున్న చరిత్ర గురించి చాలా కొద్ది మందికే తెలుసు. అధర్వణ వేదంలోని రెండవ అధ్యాయంలో అయోధ్యకు సాకేత అనే బౌద్ధానికి చెందిన పేరుండేదని స్పష్టంగా ఉంది. ‘స్వయంమగత, స్వయంమగత సాకేత ఇతి ఉచ్ఛయతే’ అని అధర్వణ వేదంలో ఉంది.బౌద్ధగ్రంథం ద్వివాదం కూడా దీన్ని ధ్రువీకరిస్తూ సాకేత నగరం తనను తాను సృష్టించుకున్నదని చెపుతుంది. సీతాదేవి శాపంతో భూమిలోకి కూరుకుపోయిన ఈ నగరాన్ని దశరథ మహారాజు నిర్మించినట్టు పురాతన జానపదుల కథలు చెపుతున్నాయి. చాలా శతాబ్దాల తరువాత విక్రమాదిత్యుడికి దేవత కలలో కనిపించి, భూమిలో కూరుకుపోయిన అయోధ్య నగరాన్ని వెలికి తీయమని కోరిందట. దాంతో ఆ రాజు భూమిని తవ్వి ఆ నగరాన్ని వెలికి తీశాడు.

ఉత్తర భారత దేశంలో 14వ శతాబ్దంలో భక్తిఉద్యమం మొదలైనప్పుడు రాముడు, అయోధ్య అనేవి ప్రాచుర్యం పొందాయి. వైష్ణవ మతానికి చెందిన రామానంద్ వర్గం కానీ, రాముడి గురించిన కీర్తనలతో ప్రసిద్ధి చెందిన తులసీదాస్ కానీ అయోధ్యకు చెందిన రాముడు మానవ రూపంలో ఉన్న భగవంతుడని (మాయా మనుష్యం హరి) చిత్రించి ఆరాధించారు. ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించడం కూడా దాని లోపలికి చేసిన ప్రయాణమే. ఈ విగ్రహం స్థాపించిన ప్రాంతం పవిత్రమైందని చెప్పడానికి చాలా తెలివిగా ప్రచారం చేయడం అవసరమైంది. దీంతో రాముడిపైన ఆరాధన సాగుతోంది. రాముడి దూత హనుమంతుడికి కూడా ప్రాధాన్యత ఏర్పడి, 18వ శతాబ్దం వచ్చేసరికి క్రమంగా దెబ్బతింటున్న ఢిల్లీ చక్రవర్తికి, అవద్ దర్బార్‌కు, తూర్పు ఇండియా కంపెనీ ప్రతినిధులకు ఇదొక సమావేశ స్థలమైపోయింది.

ఏళ్ళ తరబడి సాయుధ సాధువులు, కిరాయి సైనికులతో వీరు అధికారాన్ని పాలు పంచుకుంటున్నారు. బాబర్ విజయాలకు చిహ్నంగా ఆయన సైన్యాధికారి మీర్ బకి అయోధ్యలో ఉన్న ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించాడు. అది రాముడి జన్మస్థలమని, 1992లో ఆ మసీదును కూలగొట్టడంతో ఉత్తరప్రదేశ్‌లో అది రాజకీయాలకు కేంద్రమైంది. పార్లమెంటుకు 2019 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో అయోధ్యలో రాముడికి భవ్య, నవ్య, దివ్య మందిరాన్ని నిర్మించాలని, ఆ దారిలో హిందుత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా అధికార పార్టీ ఆడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన న్యాయ సంబంధ అనుమతులు కూడా లభించాయి. ఆలయ నిర్మాణం వేగం పుంజుకుని, 2024 పార్లమెంటు ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి కార్యాలయం సహాయ సహకారాలతో సంఫ్‌ు పరివార్ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో 500 సంవత్సరాల తరువాత రాముడు తన స్థానానికి చేరుకున్నాడని ప్రచారం చేశారు.

శంఖారావాలు మోగుతుంటే, వేలాది గొంతులు భజనలు చేస్తుంటే, భారత దేశానికి భవిష్యత్తు హిందుత్వమేనని, దేశ విదేశాల నుంచి వచ్చిన హిందువులు భావించారు. విదేశాల్లో నివసిస్తున్న హిందువులు హిందు మతాన్నే అనుసరిస్తున్నారు. దీంతో అయోధ్యలో అనివార్యంగా పెట్టుబడులు వచ్చిపడ్డాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు ఏర్పడి,ఉపాధి లభించడమే కాకుండా, అయోధ్య పర్యాటక పరిశ్రమగా తయారైంది. ఈ పనులను చూసిన ఉత్తరాఖండ్‌కు చెందిన వారు దీన్ని దేవభూమిగా అభివర్ణించారు. అయోధ్యకు అంతకు ముందు కూడా భక్తులు వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళంతా చాలా తక్కువ డబ్బు ఖర్చుపెట్టుకునే సాధారణ పల్లె ప్రజలు, వృద్ధులు. నవ యవ్వనులైన ఈ కొత్త పర్యాటకులంతా ఏడాది పొడవునా వస్తుంటారు.

వాళ్ళకు ఇంకెక్కడా ధర్మశాలలు కానీ, అద్దెకిచ్చే మంచాలు కానీ, పందిళ్ళు కానీ కనిపించవు. యాత్రికులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి హోటల్ గదులు, ఫుడ్‌కోర్టుల ఫోటోలు దారి పొడవునా కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లో ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో యాత్రికుల గుంపు గంగోత్రి, యమునోత్రి, వెనక్కి తగ్గుతున్న ఈ హిమానదాలలో ప్రయాణిస్తున్నారు. విశాలం చేసిన రహదారులు, రుతుపవనాలప్పుడు ప్రత్యక్షమయ్యే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. హిమాలయ ప్రాంతంలో అంతా మంచు పలుచబడిపోయింది. కాబట్టి అయోధ్యను దర్శించండి. అయోధ్యను ఇప్పుడు దర్శించకపోతే ఈ ప్రాంత మనోహరమైన రూపాన్ని ఇక చూడలేరు. ఎందుకంటే, భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలతో, మితిమీరిన రద్దీతో, వాహనాల రద్దీలో ఇరుక్కుపోతూ పారిశ్రామిక నగరంగా దర్శనమిస్తుంది.ఇది అందరికీ తెలసిందే. భూమి వేడెక్కుతోందన్న వాస్తవాన్ని తిరస్కరించలేని నిస్సహాయతకు సాక్ష్యంగా ఇంకా మనం ఉన్నాం.

మూలం
మృణాల్ పాండే
అనువాదం: రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News