తిరువనంతపురం: కేరళలోని శబరిమల గుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు చర్చించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం అయ్యప్ప స్వామి దర్శనం కోసం రికార్డు స్థాయిలో బుకింగ్ జరిగింది. దాదాపు 107260 మందికిపైగా దర్శనానికి బుకింగ్ చేసుకున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు అదనపు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
ఈ సీజనులో దర్శనానికి ఇంత పెద్ద ఎత్తున బుకింగ్ జరగడం ఇదే అత్యధికం. ఈ సీజనులో రెండోసారి లక్ష మార్కును దాటడం ఇది రెండోసారి. రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. పంపా నుంచి సన్నిధానం వరకు సెగ్మెంట్‌ల వారీగా భక్తుల వెంబడి పోలీసులు ఎస్కార్ట్‌గా ఉండనున్నారు.
ఇదిలావుండగా కేరళ హైకోర్టు డిసెంబర్ 11న (ఆదివారం) ప్రత్యేక సిట్టింగ్‌ను నిర్వహించింది. బిజీ రోజుల్లో భక్తుల కోసం మొక్కు సమయాన్ని పొడగించాలని సూచించింది. అంతేకాక జనాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులు, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ట్రావాంకోర్ దేవస్థానం బోర్డు(టిడిబి), శబరిమల తంత్రిని సంప్రదించి ఆలయాన్ని మరో 30 నిమిషాలు లేక గంట పాటు ఎక్కువ సేపు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు తెలిపింది. భక్తులు పెరిగిపోవడం వల్ల నియంత్రణ చర్యలు చేపట్టాల్సి వస్తోంది. జనాన్ని నియంత్రించడంలో కొంత మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు అనిల్ కె. నరేంద్రన్, పిజి. అజిత్ కుమార్ తో కూడిన ధర్మాసనం పథనంథిట్ట జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ చీఫ్‌ను రోజుకు 75000కు మించి భక్తులు వచ్చినప్పుడు జన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పథనంథిట్టలోని నిలక్కల్‌లో పార్కింగ్ గ్రౌండ్‌లు కూడా నిండుకున్నప్పుడు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా 41 రోజుల మండల పూజా పండుగ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ తర్వాత గుడి తలుపులు మకరవిలక్కు తీర్థయాత్రికుల కోసం డిసెంబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. ఆ మకర విలక్కు వేడుక 2023 జనవరి 14న ముగియనుంది.