న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు ఒక్కసారి కూడా గైర్హాజరు కాకుండా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఇద్దరు బిజెపి సభ్యులు. ఇప్పట వరకు మొత్తం 274 సార్లు సమావేశమైన 17వ లోక్‌సభలో 100 శాతం హాజరుతో మహన్ మండవి, భగీరథ్ చౌదరి అరుదైన రికార్డును సాధించారు. మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైన ఈ ఇద్దరు సభ్యుల సీట్లు సభలో పక్కపక్కనే ఉండడం విశేషం. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చిత్తశుద్ధితో నిర్వర్తించానని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ప్రాంతంలోని కంకర్ నియోజవకర్గానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని మండవి తెలిపారు.
కొవిడ్ మహమ్మారి కాలంలో కూడా తాను లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యానని ఆయన తెలిపారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ నియోజకవర్గానికి చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ లోక్‌సభ సమావేశాలకు 100 శాతం హాజరు వేసుకున్నారని పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ పేర్కొంది. ప్రస్తుత లోక్‌సభలో సభ్యుల సగటు హాజరు శాతం 79 మాత్రమే ఉంది. కాగా..లోక్‌సభలో అత్యధిక చర్చలలో పాల్గొన్న రికార్డును ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి సభ్యుడు పుష్పేంద్ర సింగ్ మండల్ సొంతం చేసుకున్నారు. ఆయన 17వ లోక్‌సభలో 1,194 చర్చలలో పాల్గొన్నారు. ఆయన తర్వాతి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన కుల్దీప్ రాజ్ శర్మ(833 చర్చలు) ఉన్నారు. ఒక్క చర్చలో కూడా పల్గొనని సభ్యులుగా ఎంపీలుగా మారిన సినీ నటులు సన్నీ దేవల్(బిజెపి), శత్రుఘ్న సిన్హా(టిఎంసి) నిలిచారు.