వణుకు పుట్టిస్తున్న వర్షాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ బీభత్సం
కాలువలుగా మారిన రోడ్లు.. కొట్టుకు పోయిన వాహనాలు
వరద ప్రవాహంలో రోడ్డుపైకి మృతదేహం
అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కారు ధ్వసం
ప్రమాదపు అంచుల్లో హుసేన్‌సాగర్
కిక్కిరిసిన మెట్రో ప్రయాణం
అత్యధికంగా యాదగిరిగుట్టలో 168మి.మి, రాజేంద్రనగర్‌లో 98.1 మి.మి వర్షం
మనతెలంగాణ/హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. వర్షపు నీటితో పలు ప్రధాన నగరాలు , పట్టణాల్లో రోడ్లన్ని కాలువల్లా మారుతున్నాయి. లోతట్టు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేగంగా ప్రవహిస్తున్న వరదనీటి ఉధృతికి రోడ్లపై ఉన్న వాహనాలు కళ్లముందే కొట్టుకు పోతున్నాయి. కల్వర్టులు , అండర్ పాసేజ్‌లు వరదనీటితో ఇరువైపులా వాహనాలను గంటల తరబడి నిలేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గంటల తరబడి ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల కొలదీ స్థబించిపోతోంది.
మంగళవారం వేకువ జామునుంచి కురిసిన వర్షం ప్రజలను ఇల్లు కదలనీయకుండా చేసింది. సాయంత్రం కూడా మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం ఆందోళన పుట్టించింది. రామ్‌నగర్ ప్రాంతంలో వరద నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి మృతదేహం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. మలక్‌పేటలో ఆర్‌ఒబి వర్షపు నీటితో నిండిపోయి ఇరువైపులా ప్రధాన రోడ్డు వెంట ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంటనగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి, అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నాంపల్లి లోని దుకాణాలలో నీరు చేరడంతో నీటిని తొలిగిస్తున్నారు.
ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, నాగోల్, మనసురాబాద్, వనస్థలిపురం, బియన్‌రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్, పాపయ్యనగర్, సంతోష్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్‌లోని వెంకటేశ్వరనగర్, ఇందర్‌సింగ్‌నగర్, వాణినగర్‌లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది.
న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో ఇండ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహరంలోనూ నీరు చేరి మెుత్తం కలుషితం అయ్యాయని బాధితులు తెలిపారు.హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీస్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్‌నగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. పార్శిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుక్‌నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పిడుగు పడడంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు.
హుసేన్ సాగర్ దిగువన హెచ్చరికలు!
ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో హుసేన్‌సాగర్ జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. 513.41మీటర్ల గరిష్ట స్థాయికిగాను మంగళవారం నాటికే నీటిమట్టం 513.40మీటర్లకు చేరింది. ఎగువ నుంచి 1850క్యూసెక్కుల నీరు చేరుతుండగా , గేట్లు తెరిచి మూసి నదిలోకి నీటిని వదులు తున్నారు. హుసేన్ సాగర్ దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.. మూసినది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా లోతట్టు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు :
మరోవైపు హైదరాబాద్‌లోని భారీ వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ-ఏపి మధ్య నిలిచిని రాకపోకలు:
జోగులాంబ గద్వాల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు వరదనీటితో పోటేత్తాయి. ఈ జిల్లాలో ఐజ ప్రాంతంలో అంతర్ రాష్ట్ర రహదారిపైరి వాగునీరు పొంగిప్రవహించింది. దీంతో ఏపిలోని కర్నూలుతెలంగాణలోని గద్వాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.
యాదగిరిగుట్టలో 168.6మి.మివర్షపాతం:
రాష్ట్రంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకూ 168 ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 30మండలాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. యాదగిరి గుట్టలో 168.6మి.మి వర్షం కురిసింది. భువనగిరిలో 124.9మి.మి వర్షం కురిసింది.నారాయణపేట జిల్లా మద్దూరులో 112.5మి.మి , సిద్దిపేట జిల్లా దొల్మిట్లలో 104 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలో సగటున 22మి.మి వర్షపాతం నమోదయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 98.1మి.మి వర్షం కురిసింది. నాంపల్లిలో 94.8, సరూర్‌నగర్‌లో 91, మారేడుపల్లిలో 88.7, బహదూర్‌పూరలో 79.9, ఆసిఫ్ నగర్‌లో 78.2, చార్మినార్‌లో 77.8, కాప్రాలో 77.6 మి.మి వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో సగటున 70.2 మి.మి వర్షం కురిసింది.
మరో నాలుగు రోజులు వర్షాలు
రాష్ట్రంలో మరో నాలుగు రోజలు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రేటర్‌హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులు ,బలమైన ఈదురుగాలులతో కూడి వర్షాలు కురిసే అవకావం ఉన్నట్టు తెలిపింది.