ఒక్కరోజే రూ.12 కోట్లు
9 కోట్లు దాటిన జీరో టికెట్లు
ఆర్టీసి అధికారుల వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించగా ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. మరోవైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు వారు పేర్కొన్నారు.
ఈనెల 11వ తేదీన 28 లక్షల మంది, 12వ తేదీన 28 లక్షల మంది, 13వ తేదీన 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసి అధికారులు దానికి తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు వారు తెలిపారు.