Friday, November 22, 2024

కేంద్రానికి ఫుల్… రాష్ట్రానికి నిల్

- Advertisement -
- Advertisement -

భారీగా పెరిగిన సెస్ ఆదాయంలో రాష్ట్రాలకు రూపాయి ఇవ్వని కేంద్రం

202122లో కేంద్రానికి
రూ.3,74,471 కోట్ల ఆదాయం
రాష్ట్రాల విన్నపాలు బుట్టదాఖలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సెస్, సర్‌చార్జీల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్, సర్‌చార్జీల రూపంలో ఏకంగా 3,74,471 కోట్ల 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ఒక్క రూపాయిని కూడా రాష్ట్రాలకు అందించడం లేదని, ఆ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసుకుంటోందని, రాష్ట్రాలకు కూడా సెస్, సర్‌చార్జీల ఆదాయంలో దామాషా ప్ర కారం వాటాలు ఇవ్వాలని కోరినా తమ విన్నపాలను కేంద్ర సర్కార్ బుట్టదాఖలు చేసిందని రాష్ట్ర ఆర్ధికశాఖలోని కొం దరు సీనియర్ అధికారులు వివరించారు. అంతేగాక 15వ ఆర్ధిక సంఘం కూడా సెస్, సర్‌చార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటాలు ఇవ్వాలని సిఫారసు చేసిందని, చివరకు ఆర్ధి క సంఘం సిఫారసులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిందని తెలిపారు.

2021-22వ ఆర్ధిక సంవత్సరంలో సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్ర ఖజానాకు వచ్చిన 3,74,471 కోట్ల రూపాయల ఆదాయంలో 41 శాతం నిధులను రాష్ట్రాలకు వాటాగా ఇచ్చి ఉంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు 1,53,533 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాల్సి ఉండిందని, కానీ ఆ నిధులను కేంద్రం ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాదిరిగానే ఒడిషా ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా అనేక విన్నపాలు చేశారని, కానీ కేంద్రం కనీసం జవాబు కూడా ఇవ్వలేదని, ఇప్పటికీ పార్లమెంటు సమావేశాల్లో కూడా టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన ఎంపీలు అనేక సార్లు ప్రస్తావించారని, సెస్-సర్‌చార్జీల్లో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆ అధికారులు వివరించారు. అదే మంటే రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులోని 246 ఆర్టికల్ ప్రకారం ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నులు విధించుకునే హక్కు, అధికారం కేంద్రానికి ఉన్నాయని చెబుతూ రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపుతున్నారేగానీ రాష్ట్రాలపట్ల కేంద్రం అంతులేని నిర్లక్షపూరితంగా వ్యవహరిస్తోందని అధికారులే కాకుండా కొందరు టి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు.

బి.జే.పీ.పాలిత ఎన్.డి.ఏ.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడచిన ఎనిమిది సంవత్సరాల్లో ఏడాదికి సగటున ఒక లక్షా 10వేల180 కోట్ల రూపాయల లెక్కన ఎనిమిదేళ్ళకు 8 లక్షల 81వేల 440 కోట్ల రూపాయలు సెస్, సర్‌చార్జీల రూపంలోనే ఆదాయం వచ్చిందని వివరించారు. సెస్, సర్‌చార్జీల రూపంలో 2018-19వ ఆర్ధిక సంవత్సరంలో 51,266 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, అదే 2020-21వ ఆర్ధిక సంవత్సరంకు వచ్చేసరికి ఏకంగా 2,24,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే విధంగా 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 3,74,471 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఈ ఆదాయం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో 16.89 శాతంగా ఉంది. ఇంతటి భారీ ఆదాయం మునుపెన్నడూ కేంద్రానికి రాలేదని, గడచిన అయిదేళ్ళల్లో అన్ని రకాల రికార్డులు బద్దలుకొట్టే విధంగా ఆదాయం వచ్చిందని వివరించారు.

2010-11వ ఆర్ధిక సంవత్సరం నుంచి 2013-14వ ఆర్ధిక సంవత్సరం వరకూ కాంగ్రెస్ సారధ్యంలోని యు.పి.ఏ.ప్రభుత్వ హయాంలో 15 కేటగిరీల్లో సెస్, సర్‌చార్జీలు నామమాత్రంగా ఉండేవని, అప్పట్లో ఏడాదికి కేంద్రానికి 49 వేల628 కోట్ల రూపాయల వరకే ఆదాయం పరిమితంగా ఉండేదని, అది కాస్తా బి.జే.పి.సారధ్యంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వ హయాంలోనికి వచ్చేసరికి 25 కేటగిరీలకు సెస్, సర్‌చార్జీలు వసూళ్ళు పెంచారని వెల్లడించారు. జి.ఎస్.టి.పన్నుల విధానం వచ్చిన తర్వాత సెస్, సర్‌చార్జీల రూపంలో పన్నుల వసూళ్ళు చేయకూడదని, కానీ అడ్డగోలుగా జనాన్ని పీడించి సెస్, సర్‌చార్జీల రూపంలో అదనపు పన్నులు వసూలు చేస్తున్నారని, దీంతో అన్ని రకాల వస్తువులపై ధరలు చుక్కలనంటాయని వివరించారు. బి.జె.పి. ప్రభుత్వం సెస్, సర్‌చార్జీల కేటగిరీల్లోకి తెచ్చిన తొమ్మిది రంగాల్లో నుంచే అత్యధికంగా 3,72,971 కోట్ల రూపాయల భారీ ఆదాయం కేంద్ర ఖజానాలోకి వచ్చిందని తెలిపారు. రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా ఈ సెస్, సర్‌చార్జీలను వసూలు చేయడంతోనే భారీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయని వివరించారు.

భారత జాతీయ సమాఖ్య స్పూర్తి ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదలాయింపులు జరగాలని, కానీ ఆ పనిచేయకుండా కేంద్రం మొండికేస్తోందని, అదేమంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్.డి.ఆర్.ఎఫ్)కు నిధులను కేటాయించి ఖర్చు చేస్తున్నట్లుగా కేంద్రం చెబుతోందని, కానీ ఎన్.డి.ఆర్.ఎఫ్. ఎన్ని లక్షల కోట్లు కేటాయించారోననే అంశాలను కేంద్ర ఆర్ధికశాఖాధికారులు మాత్రం వివరాలు వెల్లడించడం లేదని ఆ అధికారులు వివరించారు. ఇలా సెస్, సర్‌చార్జీల రూపంలో వస్తున్న ఆదాయంలో రాష్ట్రాలకు వాటా నిధులను ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు కేంద్ర సర్కార్ అనేక కుంటిసాకులు చెబుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్ అంచనాల్లో 2010-11వ సంవత్సరంలో సెస్, సర్‌చార్జీల రూపంలో వచ్చే ఆదాయం 6.26 శాతం ఉంటుందని అప్పట్లో అంచనా వేశారని, అది బి.జె.పి. ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి 2021-22వ ఆర్ధిక సంవత్సరం నాటికి మొత్తం పన్నుల ఆదాయంలో సెస్, సర్‌చార్జీల నుంచి వచ్చే ఆదాయం బడ్జెట్ అంచనాల్లో ఏకంగా 16.89 శాతానికి పెరిగిందని వివరించారు.

ఇంతటి భారీ ఆదాయం సెస్‌ల రూపంలో రావడం ఒక రికార్డేనని అంటున్నారు. జి.ఎస్.టి.పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటా నిధులు ఇవ్వాల్సి ఉన్నందున, రాష్ట్రాలకు ఇవ్వకుండా మొత్తం ఆదాయాన్ని తన ఖజానాలోనే జమ చేసుకునేందుకు వీలుగా సెస్, సర్‌చార్జీల పేరుతో తొమ్మిది కేటగిరీల్లో వసూలు చేస్తున్న పన్నులే లక్షల కోట్లు నిధులను తెచ్చిపెడుతున్నాయని వివరించారు. ఒకవైపు జి.ఎస్.టి.పేరుతో ఏడాదికి 17లక్షల 50వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, మరోవైపు సెస్, సర్‌చార్జీల పేరుతో 3.74,471 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా ఇవి చాలవన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మరో 155 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చిందని, ఈ మొత్తం నిధులను ఏయే రంగాలకు ఖర్చు చేస్తున్నారో… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతెంత నిధులను ఖర్చు చేస్తున్నారోననే విషయాలు బహిర్గతం కావడంలేదని, నిధులను ఖర్చు చేసే విషయంలో కేంద్రం గోప్యత పాటిస్తోందని ఆ అధికారులు వివరించారు. రాష్ట్రాలకు వాటాగా నిధులు ఇవ్వరు, అభివృద్ధి పథకాల్లేవు, సంక్షేమ పథకాల్లేవు, ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలన్నింటినీ అమ్ముకొంటూ ప్రైవేటీకరణ చేస్తున్నారు… మరి ఈ నిధులన్నీ ఎటు పోతున్నాయో… ఎవ్వరికీ అంతుబట్టడంలేదని అనేక అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి, కేంద్రం చేస్తున్న వ్యయానికి ఎక్కడా పొంతన కుదరడంలేదని అధికారులే కాకుండా కొందరు టి.ఆర్.ఎస్.నాయకులు సైతం కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News