న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో దేశం సతమతమవుతోంది. నిత్యం లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కారు చీకటిలో కాంతి రేఖలా గత వారం రోజులుగా కేసుల సంఖ్యలో స్థిరీకరణ కనిపిస్తోంది. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం పెద్ద ఉపశమనమని చెప్పవచ్చు. తాజాగా గడచిన 24 గంటల్లో 4 లక్షల మందికి పైగా కరోనానుంచి కోలుకున్నారు. ఒక రోజులో ఈ స్థాయిలో రికవరీలు నమోదు కావడం దేశంలో ఇదే మొదటి సారి. పాజిటివ్ కేసులతో పోలిస్తే దాదాపు లక్షా 50 వేల మంది అధికంగా కరోనానుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తాజాగా కోలుకున్న వారితో కలిపి దేశంలో ఇప్పటివరకు మొత్తం 2.15 కోట్ల మంది కరోనానుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనానుంచి ఒక్క రోజువ్యవధిలో 4 లక్షల మందికి పైగా కోలుకోవడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 4,22,436మంది రికవరీ అయ్యారని తెలిపింది. గడచిన 14 రోజులుగా సగటున రోజుకు 3,55,944 మందికి పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మరో వైపు గడచిన అయిదు రోజులుగా కొత్త కేసులకన్నా రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. దీంతో దేశంలో రికవరీ రేటు 85.60 శాతానికి చేరుకుందని తెలిపింది.
వణికిస్తున్న మరణాలు
ఇక దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,63,533 మంది కరోనా బారిన పడ్డారు.దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2.52 కోట్లుగా ఉంది. గత ఏప్రిల్ 20 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక మొత్తం కేసుల్లో 74.54 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా కర్నాటకలో 38,603 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 33,074 కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 4,329 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1000 మంది చనిపోగా, కర్నాటకలో 476 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఈ నెల 11న 4,205 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,78, 719కి చేరుకుంది. మరణాల రేటు 1.10 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 33,53,765 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు సోమవారం నాడు మరో 15,10,448 మందికి టీకా అందింది. దీంతో ఇప్పటివరకు18.44 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయడం జరిగింది.
Recovery rate increases to 85.6% in India