Saturday, November 23, 2024

నియామకాలపై దృష్టి పెట్టాలి

- Advertisement -
- Advertisement -

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే ప్రధాన అజెండాగా తీసుకున్నాయి. గత నెల రోజులుగా ప్రతిపక్షాలు సైతం ఇదే అంశంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరుద్యోగం, నియామకాల అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. దాదాపు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏడాది కిందట బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. వరుస నోటిఫికేషన్లను టిఎస్‌పిఎస్‌సి, పోలీసు నియామక మండలి విడుదల చేశాయి. ఈ క్రమంలో రెండు నెలల కిందట వెలుగు చూసిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది. దీని తర్వాత రాష్ర్టంలోని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల అంశం మీద ప్రభుత్వంపై గళమెత్తడం ప్రారంభించాయి.

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో యువ సంఘర్షణ సభ నిర్వహించి యూత్ డిక్లరేషన్ ప్రకటించి తాము అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేయడం, సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది. అయితే నిరుద్యోగుల డిక్లరేషన్ వెనుక ఓట్లు ఒక్కటే కాదు, నిరుద్యోగుల సమస్యలను ఎత్తి చూపాలనే అజెండా ఉంది. తెలంగాణ ఏర్పాటు వెనుక మూడు ఉద్దేశాలు ఉన్నాయనుకుంటే నిధులన్నీ నీళ్ల కోసమే ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ నియామకాలను పట్టించుకోలేదు. దీని వల్ల నిరుద్యోగ యువత ఆందోళనలో వున్నారు.

వారికి భరోసా కల్పించడం కోసమే కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తెచ్చింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ తరపున 2019లో జరిపిన సర్వే ప్రకారం 20 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తెలంగాణలో ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య 25 లక్షలకు చేరిందని రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా. వీరితో పాటు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ దశలో మరో 5 లక్షల మంది ఉంటారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఎపి సహా 13 రాష్ట్రాలలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. తెలంగాణలో పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి నిరుద్యోగ రేటు 65 శాతంగా ఉన్నట్లు ఆర్‌బిఐ అంచనా వేసింది. అంతకు ముందు 2019- 20 ఏడాదిలో 97 శాతంతో పోల్చితే ఇది తక్కువగా ఉంది. తెలంగాణ కంటే 16 రాష్ట్రాలల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు గతేడాది మార్చి 9న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఇటీవల కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. ప్రకటించిన 80,039 ఉద్యోగాలల్లో ఏ మేరకు భర్తీ చేశారన్నది తెలీదు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల 20 వేల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. గత తొమ్మిదేళ్లలో తెలంగాణను ఉపాధి కల్పనలో నంబర్ వన్ స్థానంలో నిలిపాం. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బిజెపిలే క్షమాపణలు చెప్పాలి అని ముఖ్యమంత్రిగా అప్పుడు కెసిఆర్ అన్నారు. టిఎస్‌పిఎస్‌సిలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా గ్రూప్-1 ప్రిలివ్‌‌సు, ఎఇ, డిఎఒ పరీక్షలను రద్దు చేయగా, మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ అప్పట్లో భాగస్వాములైంది నియామకాల కోసమే. ఏళ్ల తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినా లీకేజీ వ్యవహారంతో నియామకాలు సరిగా జరగలేదు. వీటికి పరిష్కారం దొరకాలంటే అసలు టిఎస్‌పిఎస్‌సిలో రాజకీయ జోక్యం ఉండకూడదు.

పైరవీల అవకాశం లేకుండా శాశ్వత ఉద్యోగులను నియమించాలి. అనుభవం ఉన్న వారిని నియమించి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలను నిర్వహించాలి.
తల్లిదండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. నిరుడు ప్రకటించిన ఉద్యోగ నియామక ప్రకటనల్లో దాదాపు 17 వేల ఉద్యోగాలు పోలీసు శాఖవే ఉన్నాయి. అవి ముందుకు సరిగా సాగలేదు. నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. రాష్ర్టం ఏర్పడిన ఆరున్నరేండ్ల తర్వాత తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నియామకం జరిగింది. దీనిని బట్టే మహిళల రక్షణ, వాళ్ల అభివద్ధిపై మన చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతోంది. నేడు రాష్ర్టంలో యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలు ఇలా ఏ నేరం జరిగినా వాటిలో ఇతర కారణాలు ఓ వైపు అయితే సగానికి పైగా నిందితులపై లిక్కర్ ప్రభావం ఉంటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేరాలు తగ్గాలంటే ముందు లిక్కర్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వాలు లిక్కర్‌ను ఆదాయం తెచ్చే మార్గంగా చూడకుండా ఆల్టర్‌నేటివ్స్ ఆలోచించాలి. తెలంగాణ వ్యాప్తంగా 17,634 బెల్ట్ షాపులున్నాయి. ఈ బెల్ట్ షాపులన్నీ మూసివేసేందుకు నడుం బిగించాలి. ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాల మూలంగానే రాష్ర్టంలో మహిళలపై అత్యాచారాలు, హత్య లు అధికమవుతున్నాయి. క్రమంగా రాష్ర్ట వ్యాప్తంగా వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించేలా ప్రభుత్వాన్ని కోరాలి. అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు మూలాలను గుర్తించి, అసలు ఆ నేరప్రవత్తి పెరగకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్చలపై దృష్టి పెట్టాలి. సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించి మహిళల సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించాలి. పరిష్కార మార్గాలు సూచించాలి. ఇందులో ఏ పని జరగాలన్నా మహిళా కమిషన్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందాలి. నిరుద్యోగ సమస్యను రాజకీయ అవకాశాలను సృష్టించే సమస్యగా కాకుండా, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతగా భావించాలి.

ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేయడం, ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ప్రాధాన్యత ప్రోత్సాహకాలు ఇవ్వటం, స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టడం నైపుణ్యాలను పెంచడం లాంటి చర్యల ద్వారా కొంత మేరకు నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రధానమైన అంశంగా మారనంత కాలం నిరుద్యోగానికి పరిష్కారం దొరకదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News