Monday, January 20, 2025

రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !

- Advertisement -
- Advertisement -

వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల సంగతేమిటని ప్రశ్నించినందుకు మంత్రి వర్గం నుంచి ఇటీవల ఉద్వాసనకు గురయ్యారు. మొన్న సోమవారం నాడు అసెంబ్లీకి హాజరైన గుధా తన వద్ద గల ‘రెడ్ డైరీ’లో ముఖ్యమంత్రి గెహ్లాట్‌ను జైలుకు పంపించడానికి దోహదపడే సంచలనాత్మక విషయాలున్నాయని ప్రకటించారు.

ఆ డైరీని చేతపట్టుకొని గాలిలో ఊపుతూనే ఆయన సభలో ప్రవేశించారు. గెహ్లాట్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ, సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఇండిపెండెంట్లకు, బిజెపి ఎంఎల్‌ఎలకు డబ్బు పంచినప్పటి వివరాలు ఆ డైరీలో వున్నట్టు రాజేంద్ర సింగ్ గుధా ప్రకటించారు. గతంలో రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్ ఇంటిలో ఇడి సోదాలు నిర్వహించినప్పుడు ఈ డైరీని తన వద్ద వుంచాలని ముఖ్యమంత్రి కోరగా అది తన వద్దకు వచ్చిందని గుధా చెబుతున్నారు. దీని గురించి సోమవారం నాడు ఆయన సభలో ప్రస్తావించగానే గలభా చోటు చేసుకొన్నది. చివరికి మార్షల్స్ ఆయనను బయటికి పంపించారు. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు బిజెపి ఎంఎల్‌ఎ మదన్ దిలావర్ కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.

దిలావర్ తనపై దాడికి ప్రయత్నించారని మంత్రి శాంతి ధరివాల్ ఆరోపించారు. వీరిద్దరి సస్పెన్సన్‌తో ప్రతిపక్ష బిజెపి సభ్యులు ఎర్ర డైరీలు ఊపుతూ సభలో నిరసన తెలియజేశారు. రాజేంద్ర సింగ్ గుధా బిఎస్‌పి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. మొదట్లో గెహ్లాట్‌కు మద్దతు ఇస్తూ వచ్చిన ఆయన సచిన్ పైలట్‌కు అనుకూలంగానూ వ్యవహరించారు. ముఖ్యమంత్రి తనకు అప్రధానమైన మంత్రిత్వ శాఖను కేటాయించారన్న అసంతృప్తితో గుధా తిరుగుబాటు చేసినట్టు తెలుస్తున్నది. లోపల వుంటూ పార్టీపైనా, దాని ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తే ఏ పార్టీ నాయకత్వమూ సహించదు. అటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో, బహిష్కరించడమో సర్వసాధారణం. ఈ గొడవ, గందరగోళంలో ఆ సభ్యుని ఆరోపణలు ఎంత వరకు వాస్తవమన్నది మరుగున పడిపోతుంది, ఎప్పటికీ బయటపడదు. రాజేంద్ర సింగ్ గుధా ఆరోపణలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇడి, సిబిఐ, ఇన్‌కమ్‌టాక్స్ విభాగాలను ఉసిగొల్పితే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే అశోక్ గెహ్లాట్ ఎన్నో డక్కామొక్కీలు తిన్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి పార్టీ అధ్యక్ష పదవికి మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం చేసిన ప్రయత్నమే విఫలమైంది.

తాను సిఎం పదవి నుంచి తప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసినా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ఏమీ చేయలేకపోయింది. పార్టీ అధిష్ఠాన వర్గం పట్ల ఆయన విధేయతను ఎవరూ శంకించలేకపోయారు. సోమవారం నాడు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించిన గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు విలక్షణమైనది. ఈ చర్యను ఇంత వరకు వేరే ఏ రాష్ట్రంలోనూ, ఇతర దేశాల్లో కూడా తీసుకోలేదని చెబుతున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీల తరపున వినియోగదారులకు వివిధ హోటళ్ళ ఆహారాన్ని వీలైనంత తొందరలో చేరవేసే సిబ్బందిని గిగ్ వర్కర్స్ అంటున్నారు. రాజస్థాన్‌లో ఈ సిబ్బంది నమోదుకు, వారి సంక్షేమానికి అవకాశమిచ్చే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దాని మీద గవర్నర్ సంతకం చేస్తే అది చట్టం అవుతుంది. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంలో సామాజిక కార్యకర్త నిఖిల్ డే ఇటువంటి చట్టాన్ని తీసుకు రావాలని ఆయనను కోరినట్టు చెబుతున్నారు. ఆ మేరకు గెహ్లాట్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టినట్టు సమాచారం.

అధిక ధరల నుంచి తన ప్రజలను రక్షించడానికి ద్రవ్యోల్బణ సహాయ ఉద్యమం పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని మరింత పెంచడం లక్షంగా దీనిని అమలు పరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 శిబిరాలు నిర్వహించి అన్ని సంక్షేమ పథకాల్లోనూ అర్హులందరూ చేరేలా చేయడం దీని ఉద్దేశం. అలాగే ఆరోగ్య హక్కు చట్టాన్ని కూడా తీసుకు వచ్చారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొన్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పుకొంటున్నది. అయితే గెహ్లాట్, పైలట్‌ల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా వున్న వైరాన్ని ఒక కొలిక్కి తేవడంలో అధిష్ఠానం విఫలమవుతున్నది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 108 స్థానాల బలమున్నది. మిత్ర పక్షాలతో కలిసి 122 మంది సభ్యుల మద్దతు గెహ్లాట్ ప్రభుత్వానికి వున్నది. బిజెపికి 70 స్థానాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ను గెలిపించే భారాన్ని గెహ్లాట్ తనపైన వేసుకొన్నారు. రెడ్ డైరీ వంటి ఉదంతాలు ఆయన నాయకత్వాన్ని ఎంత వరకు దెబ్బ తీయగలవో ఎన్నికల్లో గాని బయటపడదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News