లోక్సభలో ప్రకటించిన కేంద్రం
2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారమే శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది
అందుకు మరి పదేళ్లు పడుతుందని స్పష్టం చేసిన
కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా తేటతెల్లం చేసింది. మరో పదేళ్ల తరువాతనే (2031) ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో పేర్కొన్న విధంగా కొత్తగా జనాభా లెక్కల సేకరించిన మీదటనే నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2026లో కేంద్రం ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టిపిసిసి అధ్యక్షుడు, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి మంగళవారం సభలో ఈ ప్రశ్న లేవనెత్తారు.
ఎపి విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరముందన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు ఎప్పుడు ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. కాగా నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఎపిలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెరగనుండగా, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను 153కు పెరగనున్నాయి.