Sunday, January 19, 2025

18 ఏండ్లకే చట్టసభల పోటీకి ఛాన్స్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం యువభారతం అవుతున్నప్పుడు చట్టసభలు అసెంబ్లీ, లోక్‌సభలకు వారి పోటీకి కనీస వయో అర్హతను తగ్గించాలని వాదన ఆరంభం అయింది. ప్రజాస్వామ్యంలో యువతరానికి సమాన అవకాశాలు ఇవ్వాల్సి ఉందని , ఈ మేరకు వారు తక్కువ వయస్సులోనే చట్టసభలలో ప్రవేశించేందుకు వీలు కల్పించాల్సి ఉందని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ప్రజాస్వామ్య భారతంలో యువతకు మరింత సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. వారు 18వ ఏటనే చట్టసభలకు ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పిస్తే , వారిని నేరుగా ప్రజాస్వామిక ప్రక్రియలోకి తీసుకువచ్చినట్లు అవుతుంది. దీనితో వారి భవితకు అవసరమైన రీతిలో ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహించేందుకు వీలేర్పడుతుంది. ఇప్పుడున్న చట్టపరమైన పద్ధతుల ప్రకారం లోక్‌సభకు , అసెంబ్లీలకు పోటీ చేసేందుకు వ్యక్తులు పాతిక సంవత్సరాలైనా ఉండితీరాల్సి ఉంది. దీనిని 18 సంవత్సరాలకు కుదించాలని లా అండ్ పర్సనల్ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

ఇప్పుడు దేశంలో ఎవరైనా 18 సంవత్సరాలు నిండితే ఓటరుగా నమోదు చేసుకునే అర్హత పొందుతారు. దేశంలో యువతరం సంఖ్య అత్యధికం అవుతోంది. ఓటు హక్కు పొందిన దశ నుంచే వీరికి రాజకీయాల్లో పోటీకి వీలు కల్పిస్తేనే ఈ ఓటు హక్కుకు మరింత విలువ ఉంటుందని కమిటీ తెలిపింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రాజ్యసభ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్‌ల సభ్యులుగా ఎన్నికయ్యేందుకు కనీస వయో పరిమితి 30 సంవత్సరాలుగా ఉంది. దీనిని కూడా 18 ఏండ్ల స్థాయికి తగ్గించాలని సూచించారు. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇతర దేశాలలో ఉన్న వయోపరిమితి నిబంధనలను పరిశీలించిన తరువాత జాతీయ స్థాయి ఎన్నికలలో పోటీ అర్హత 18 ఏండ్లుగానే చేయాల్సి ఉందని తాము సిఫార్సు చేస్తున్నట్లు, దీని వల్ల అత్యధిక సంఖ్యలో యువత నిర్మాణాత్మకంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకునేందుకు వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పార్లమెంటరీ ప్యానెల్‌కు బిజెపికి చెందిన ఎంపి సుశీల్ మోడీ సారధ్యం వహిస్తున్నారు.

ఇక ఎన్నికలలో పోటీకి వయోపరిమితికి సంబంధించి ఎన్నికల సంఘం వాదన ప్రకారం మార్పునకు సరైన కారణాలను చూపాల్సి ఉంది. అప్పుడే వయోపరిమితిని తగ్గించేలా రాజ్యాంగంలో మార్పులకు వీలేర్పడుతుందని, లేకపోతే ఈ వయోపరిమితి ఇదే విధంగా ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News