గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో పెరిగిన 9.87శాతం కేసులు తగ్గిన రోడ్డు ప్రమాదాల సంఖ్య
ఒకటి, రెండు ఘటనలు మినహా అదుపులో శాంతిభద్రతలు సైబర్ నేరగాళ్ల నుంచి తొలిసారి
రూ.2.42కోట్ల నగదు వాపస్ 85మంది నక్సల్స్ అరెస్టు నేర వార్షిక నివేదిక విడుదల
చేసిన డిజిపి, అధికారులు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్లే పోలీసుల ఆత్మహత్యలని వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87 శాతం కేసులు పెరిగాయని 2,34,158 కేసు లు నమోదైనట్లు డిజిపి డాక్టర్ జితేందర్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ ఏడాది 20,702 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. కొత్తగా 11,64,645 సిసి కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘నేర వార్షిక నివేదిక’ను విడుదల చేశారు. ఈ ఏడాది శాంతి భద్రతలు బాగున్నాయని, ఒకటి, రెండు ఘటనలు మినహా పూర్తి అదుపులో ఉన్నట్లు చెప్పారు. ’కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చాం.
డిజిటల్ ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసు లు నమోదయ్యాయి. 142. 95 కోట్ల విలువ చేసే 20 టన్నుల డ్రగ్స్ సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్ట్ చేశాం. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం నేరాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొత్తంగా 25,184 సైబర్ క్రైం కేసులు నమోదు కాగా, 2023తో పోలిస్తే 43.33 శాతం మేర సైబర్ క్రైం నేరాలు పెరిగాయి. దేశంలోనే తొలిసారి రూ. 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించాం. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించాం. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వా త 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచ కొండలో 10,251 కేసులు నమోదు చేశాం’ అని డిజిపి జితేందర్ వివరించారు.
అల్లు అర్జున్ ఘటనలో ఇప్పుడేం మాట్లాడలేం..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ మీద నమోదు అయిన కేసుపై తెలంగాణ డీజీపీ జితేందర్ మ రోసారి స్పందించా రు. అల్లు అర్జున్ కేసుపై జర్నలిస్టులు డిజిపిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఇప్పుడు మేం ఏం మాట్లాడలేమన్నారు. 547 మంది ఎస్‌ఐలు, 12,338 మంది కా నిస్టేబుళ్ల నియామకం చేపట్టామన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ సాగుతోంది…!
ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ సాగుతోంది. ఈ కేసులో సిబిఐకి లేఖ రాశాం. ప్రభాకరరావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ తీసుకొచ్చేందకు టైం పడుతుంది అని పేర్కొన్నారు.
పోలీసు ఆత్మహత్యలపై….
రాష్ట్రంలో పోలీస్ ఆత్మహత్యలపై స్పందిస్తూ.. ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నా రు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబసమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
అనధికార ప్రైవేటు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం
సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశామని అనధికార ప్రైవేటు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తామన్నారు. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారని వెల్లడించారు. సైబర్ క్రైమ్ కేసులు ఏమున్నా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగా యి. 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా రూ.247 కోట్లు ఫ్రీజ్ చేశామని వివరించారు.
ముగ్గురికి న్యాయస్థానాలు మరణశిక్ష విధింపు
ఈ ఏడాది ముగ్గురికి న్యాయస్థానాలు మరణ శిక్ష విధించాయన్నారు. హైదరాబాద్‌లో ఇద్దరు, సంగారెడ్డిలో ఒక కేసులో మరణ శిక్ష విధించినట్లు చెప్పారు. ఈ ఏడాది రౌడీ షీటర్లకు 18 కేసుల్లో 35 మందికి జీవిత ఖైదు విధించారు. అత్యాచారం కేసుల్లో ఈ ఏడాది 3 కేసుల్లో నలుగురికి జీవిత ఖైదు విధింపు. మహిళలపై దాడులకు సంబంధించి 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. పోక్సో కేసులు 77 నమోదు కాగా 82 మందికి శిక్ష ఖరారైంది. ఫింగర్ ప్రింట్స్ టీమ్ 507 కేసులు ఛేదించారు. 71 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు. షీ టీమ్స్ 10,862 పబ్లిక్ ప్రదేశాల్లో వేదింపులు ఫిర్యాదులు, అందులో 830 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.