కృష్ణ, గోదావరి నదులపై గల ప్రాజెక్టుల్లోకి తగ్గిన వరద నీటి ప్రవాహాలు
మంజీరా నదిపై గల సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్‌కు పెరిగిన ప్రవాహం, ఎల్లంపల్లి 42 గేట్లు ఎత్తివేత
నిలకడగా కృష్ణ, జూరాలకు 64వేల క్యూసెక్కులు, ఎల్లపంల్లిలో 5.41లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 73వేల క్యూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణం తెరపినివ్వటంతో కృష్ణ, గోదావరి పరివాహకంగా ప్రధాన ప్రాజెక్టులోకి వరద నీటి ప్రహాలు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్ర పరిధిలో గోదావరి నదిలో వరద తగ్గినప్పటికి గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీరా నది వరదనీటితో పోటేత్తింది. ఇప్పటికే మంజీరా నదిపై ఉన్న సింగూరు , నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండటంతో ఈ ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేశారు. దీంతో మంజీరా నది గోదావరి వైపు ఉరకలెత్తి ప్రవహిస్తోంది. అటు మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదప్రవాహానికి మంజీరా నుంచి వస్తున్న 54416క్యూసెక్కుల వదర కూడా జత కలవటంతో ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఉదయం 2.70లక్షల క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 2,94,550క్యూసెక్కులకు పెరిగింది.
ప్రాజెక్టు గేట్లు 33గేట్లు ఎత్తివేసి జలాశయం నుంచి 2,57,400క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.దిగువన ఎల్లంపల్లి జలాశయానికి కూడా ఉదయం 5,53,050క్యూసెక్కుల ఉన్న వరద ప్రవాహం సాయంత్రానికి 5,41,827క్యూసెక్కులకు తగ్గిం ది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు 42గేట్లు ఎత్తివేశారు. ఎగువనుంచి వస్తున్న వరదనీటిని వస్తున్నట్టే దిగువన నదిలోకి విడిచిపెడుతున్నారు. ఎగువనుంచి మిడ్ మానేరు జలాశయంలోకి 6720క్యూసెక్కుల నీరు చేరుతుండగా , 6890క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువ మానేరు జలాశయంలోకి 29,437క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,గేట్ల ద్వార వస్తున్న నీటిని వస్తున్నట్టే బయటకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 34,541క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 14,079క్యూసెక్కులు ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 44,600క్యూసెక్కులు ఉండగా , ఔట్‌ప్లో 54,416క్యూసెక్కులు ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
కృష్ణానదిలో వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 64,000క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా,జలాశయం నుంచి 51,136క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ఎగునుంచి 73,801 కూసెక్కులు నీరు చేరుతుండగా, 37,656క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 17,151క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నా రు. దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 19,444క్యూసెక్కుల నీరు చేరుతుండగా,అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులోకి ఎగువనుంచి 16,259క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా , జలాశయం నుంచి 3,759క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.