Friday, November 22, 2024

అగాధంలో ‘ఆర్థికం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అసలైన ప్రమాదకరమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ప్రముఖ విశ్లేషకుడు, ఇంజినీర్, కన్సల్టెంట్ పౌల్ కోషీ ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ప్రధానమైనది దారుణంగా తగ్గిపోయిన దేశ విదేశీ ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు ఒకటని ఆయన అంటూ అందుకు సంబంధించిన వాస్తవాలను ట్విట్టర్ ద్వారా ప్రజల ముందుంచారు. పౌల్ కోషీ భారత దేశ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తుల్లో ఒకరు కావడం గమనార్హం. దిగుమతుల వ్యయానికి, విదేశీ అప్పులను తిరిగి చెల్లించడానికి, విద్య, వై ద్యం, పర్యాటకం, ప్రాజెక్టుల నిర్మాణం వం టి పలు సేవల కోసం ఏ దేశానికయినా విదే శీ ద్రవ్య నిల్వలు చాలా అవసరం. వాస్తవాని కి విదేశీ ద్రవ్య నిల్వలను బట్ట్టే ఆ దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుంటారు. విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటి పోవడం వల్లనే శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి మన పొరుగు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి.

అయితే ఆ దేశాల ఆర్థిక సంక్షోభాల గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి తప్పించి మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి వచ్చే వార్తలు దాదాపుగా మృగ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దేశాల ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా చర్చించుకునే మనం మన దేశం ఎదుర్కొంటున్న అసల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశం జరిపే ఎగుమతులు, విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపించే సొమ్ముల ద్వారానే ప్రధానంగా విదేశీ ద్రవ్య నిల్వలు మనకు సమకూరుతుంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంనుంచి జరిగే ఎగుమతులకన్నా మనం దిగుమతి చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉంటున్నాయి. మరో వైపు మోడీ ప్రభుత్వ హయాంలో మన దేశం ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఎడిబి)లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనుంచే కాకుండా ఇతర మార్గాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా సేకరించింది. 2022 సెప్టెంబర్ చివరి నాటికి మన దేశం విదేశీ రుణ భారం 621.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ గణాంకాలే చెబుతున్నాయి. ఇది దేశ స్థూల ఉత్పత్తి ( జిడిపి)లో 19.2 శాతం.

ఈ మొత్తం విదేశీ రుణాల్లో 40 శాతానికి పైగా అంటే 267 బిలియన్ డాలర్లు వచ్చే తొమ్మిది నెలల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన మొత్తం విదేశీ ద్రవ్య నిల్వల్లో దాదాపు44 శాతానికి సమానమని ఆర్‌బిఐ గణాంకాలే చెబుతున్నాయి. అంటే మన విదేశీ ద్రవ్య నిల్వల్లో చాలా అప్పులు చెల్లించడానికే పోతాయి. మరో వైపు డాలరుతో రూపాయి విలువ ఇటీవలి కాలంలో భారీగా పడిపోయింది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూనే ఉంది. అంటే గతంలో డాలర్లలో తీసుకున్న రుణాలకు ఇప్పుడు మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకునే సమయంలో డాలరుతో రూపాయి విలువ తక్కువగా ఉండగా ఇప్పుడది పెరిగిపోవడం వల్ల రుణ భారం మరింత ఎక్కువ అయిందనేది కాదనలేని సత్యం. ఒకప్పుడు డాలరుతో రూపాయి విలువ 60 రూపాయల లోపే ఉండగా ప్రస్తుతం డాలరుతో రూపాయి విలువ దాదాపు 83 రూపాయలకు చేరుకున్న విషయం తెలిసిందే.

పెరిగిపోయిన కరెంటు ఖాతా లోటు

గత కొంత కాలంగా ఎగుమతులకన్నా దిగుమతులు భారీగా పెరిగిపోతున్నాయి. ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువగా ఉండడాన్ని కరెంటు ఖాతా లోటుగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తుంటారు. గత ఏడాది 1.2 శాతంగా ఉండిన కరెంటు ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 3.1 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం వాదన వేరుగా ఉంది. భారత దేశ జిడిపి వృద్ధి ప్రపంచంలోని చాలా దేశాలకన్నా మెరుగ్గా ఉందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ప్రభుత్వం అంటోంది. అయితే జిడిపి వృద్ధి బాగానే ఉన్న మాట నిజమే కానీ, డాలరుతో రూపాయి బలహీనపడ్డం వల్ల అందులో అధిక భాగం పెరిగిపోతున్న మన దిగుమతులకే ఖర్చవుతోందన్న వాస్తవాన్ని మాత్రం మోడీ ప్రభుత్వం బైటపెట్టడం లేదు. ఉదాహరణకు ఫిబ్రవరి 17తో ముగిసిన వారంలో మన విదేశీ ద్రవ్య నిల్వలు 5.68 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 561.26 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఇది 11 వారాల్లో కనిష్టస్థాయి కావడం గమనార్హం. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి బహుశా రిజర్వ్ బ్యాంక్ పెద్ద మొత్తంలో డాలర్లను విక్రయించడమే దీనికి కారణం కావచ్చు. మరో వైపు ఆర్‌బిఐ వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ సైతం అదే సమయంలో 1.04 బిలియన్ డాలర్లు పడిపోయి 41.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రుణాలు తీసుకోవడానికి మన దేశానికి ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ సైతం 87 మిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్) వద్ద భారత దేశ రిజర్వ్‌ల పరిస్థితి సైతం గత వారం 34 మిలియన్ డాలర్ల మేర తగ్గిపోయి 5.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఈక్విటీ మార్కెట్లనుంచి తరలిపోతున్న విదేశీ సంస్థలు

భారతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు ముఖ్యంగా విదేశీ సంస్థలనుంచి అమ్మకాల ఒత్తిడి కారణంగా విదేశీ ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి.‘ ప్రపంచ మార్కెట్లు మెరుగుపడుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లు విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి’ అని కోషీ అంటున్నారు.

తగ్గిపోయిన జిడిపి

ఇక చివరగా దేశ స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి) గత త్రైమాసికంలో 4.6 శాతానికి పడిపోయినట్లు తాజాగా ఓ సర్వేలో పాల్గొన్న 42 మంది ఆర్థికవేత్తలు అభిప్రాయాలు అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది మరింత మందగించి 4.4 శాతానికి చేరుకోవచ్చని కూడా వారు అంటున్నారు. కాగా ప్రతి రోజూ అదానీ కుంభకోణం, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ముస్లింలను కొట్టి చంపడం, పవన్ ఖేరా అరెస్టు లాంటి వార్తలను పతాక శీర్షికలతో పత్రికలు మనల్ని పక్కదారి పట్టిస్తున్నప్పటికీ దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలైన సమస్యలపైన కూడా ఓ కన్నేసి ఉండేవిధంగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉందని పౌల్ కోషీ దేశ ప్రజలను హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News