కమర్షియల్ ధర రూ.115.50 తగ్గింపు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపి కబురు అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ తగ్గింపు వల్ల కేవలం ఒక వర్గం వినియోగదారులకే ఊరట లభించనుంది. అయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గించాయి. సాధారణంగా ఇళ్లలో వినియోగించే వంటగ్యాస్‌కు ఉపయోగించే 14.2కిలోల గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగా కొనసాగించాయి. కమర్షియల్ అవసరాలకు వాడే 19కిలోల ఎల్పీజి సిలిండర్ ధరను రూ.115.50మేరకు తగ్గిస్తున్నట్టు గ్యాస్ కంపెనీలు తెలిపాయి. ఈ తగ్గింపు ధరను మంగళవారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాయి. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1844కు బదులుగా రూ.1744కే లభించనుంది.కోల్‌కతాలో రూ.1995కు బదులుగా రూ.1846కే లభించనుంది. అటు ముంబైలో కూడా రూ.1844కు బదులుగా రూ.1696కే అందుబాటులో ఉంటుంది. చెన్నైలో రూ.2009కి బదులుగా రూ.1893కు అందుబాటులో ఉంటుంది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ 14.2కిలోలు గ్యాస్ ధర రూ.1105గా కొనసాగుతుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి.