హైదరాబాద్: నగరంలో వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు, నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ చిన్నపాటి జల్లులు తప్ప వర్షం కురవకపోవడంతో సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరం పూర్తిగా అతులకుతలం కావడంతో నుంచి జిహెచ్‌ఎంసి సహాయక చర్యలను ముమ్మరం చేసిన జిహెచ్‌ఎంసి బుధవారం సైతం సహాయ చర్యలను కొనసాగించింది. దీంతో చెరువులు, కుంటులతో పాటు మూసీ పరివాహక పరిసర ప్రాంతాల్లో తప్ప నగరమంతా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లనుంచి మూసీకి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ముసారాం బాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిలపై పోలీసులు ఆంక్షలను కొనసాగించారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పరిసర ప్రాంతాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటీకు 60 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు వరద ప్రవాహం ఇకా కొనసాగుతుండడంతో అవసరమైతే మరిన్ని కుటుంబాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారు. అదేవిధంగా మూసీ నది పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.