Friday, November 22, 2024

నగరంలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -
Reduced road accidents in Hyderabad
2021లో 1,657 నమోదు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13మంది మృతి

హైదరాబాద్: నగరంలోని ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు ఘననీయంగా తగ్గాయి. నాలుగేళ్ల నుంచి చూస్తే ఈ ఏడాది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా తగ్గాయి. 2017లో 2,367, 2018లో 2,540, 2019లో 2,493, 2021లో 1,657 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ మేనేజెమెంట్‌పై నగర పోలీసులు చాలా చర్యలు తీసుకోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి, వాటికి గల కారణాలను కనుగొని చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండడంతో మందుబాలు భారీగా పట్టుబడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమానా విధించడమే కాకుండా, హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపుతున్న వారు ఎంతటి వారైనా కూడా పోలీసులు వదలకుండా జైలుకు పంపిస్తున్నారు. కొందరి లైసెన్స్‌లు రద్దు చేసేందుకు ఆర్టిఏ అధికారులకు సిఫార్సు చేస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం మత్తులో ఉండడం వల్లే జరిగాయని పోలీసుల విచారణలో తేలడంతో వాటిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా వరకు మద్యం తాగి వాహనాలు నడిపేవారు తగ్గుతున్నారు. ఇప్పటి వరకు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 237మంది మృతిచెందారు. ఇందులో 178మంది ఓవర్ స్పీడ్ వల్ల, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల 13మంది, రాంగ్ రూట్‌లో వెళ్లే వారు 10మంది, మైనర్ డ్రైవింగ్ 6, కేర్‌లెస్, నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడంతో 24మంది మృతిచెందారు. నగర పోలీసులు తరచూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నగర పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 1,66,010 వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

గాయపడ్డవారు తగ్గారు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారు ఈ ఏడాది తగ్గారు. 2021లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,108మంది గాయపడ్డారు. 2017లో 1,903, 2018లో 2,076 మంది, 2019లో 2,063, 2020లో 1,510, 2021లో 1,108 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు.

ఆధునిక టెక్నాలజీ…

నగరం ట్రాఫిక్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడడంతో చాలా వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారి వివరాలు వెంటనే తెలిసిపోతున్నాయి. అంతేకాకుండా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వాహనాలు వేగం పెరిగింది. రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్నా కూడా వాహనాల వేగం పెరిగింది. మిగతా మెట్రో నగరాల్లో వాహనాల వేగం హైదరాబాద్‌తో పోల్చుకుంటే చాలా ముందుఉంది. ఇంటెలీజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం వ్యవస్థను నగరంలో అమలు చేస్తున్నారు. దీనిని అమలు చేస్తున్నప్పటి నుంచి నగరంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. దేశంలోని పలు నగరాలకు చెందిన అధికారులు హైదరాబాద్ పోలీసులు వాడుతున్న అత్యాధునిక టెక్నాలజీని పరిశీలించేందుకు నగరానికి వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News