శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల, వెంకట్, శ్రీధర్, ముని, నవీన్, కళ్యాణ్, ప్రవీణ్, ప్రశాంతి నటీనటులుగా రూపొందిన చిత్రం ‘ఆశా ..ఎన్‌కౌంటర్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ “రేపిస్టుల స్వభావం, ఆ సమయంలో వాళ్లు ప్రవర్తించిన విధానం, వారి సైకాలజీ ఎలా ఉంది? అనే దానిపై ఈ చిత్రంలో ఫోకస్ ఉంటుంది. ఇది కల్పిత కథ. అత్యాచారాల సమస్యలకు మూలం ఎక్కడుంది? దానికి చట్టపరమైన శిక్షలు పరిష్కారం కాదనేది ఈ సినిమాలో చూపించాము” అని అన్నారు. ఇక ఏపిలో సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై ఆర్జీవి మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించడం పూర్తిగా తప్పు. ఉత్పత్తిదారులకి ధర నిర్ణయించుకునే హక్కు ఉంది.
కొనాలా, వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం. టికెట్ ధర ఎంత ఉన్నా నచ్చిన వాళ్లు చూస్తారు, నచ్చని వాళ్లు చూసే అవకాశమే లేదు. సాధారణ కారు ధరకు బెంజ్ కారు ఇవ్వాలని అంటే ఎలా? టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ఏపి ప్రభుత్వం కావాలనే చిత్ర పరిశ్రమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, లేదా అనేది నాకు తెలియదు. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల హీరోలకు నష్టం ఏమీ లేదు. ఇలాంటి చర్యల ద్వారా అగ్ర హీరోల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అసాధ్యం. ఏపి ప్రభుత్వం ఏం చేసినా హీరోల పారితోషికం తగ్గదు. టికెట్ ధరలు తగ్గించడంతో నిర్మాతలకు నష్టం కలుగుతుంది. ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే”అని అన్నారు.