బ్రిటన్ రీడింగ్ వర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
లండన్ : యువకులు విటమిన్ బి6 సప్లిమెంట్స్ అత్యధిక డోసు తీసుకుంటే ఆందోళన, నిస్పృహ తగ్గుతుందని బ్రిటన్ లోని రీడింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. నెలరోజుల పాటు ప్రతిరోజూ విటమిన్ బి 6 మాత్రలు తీసుకుంటే యువతలో వీటి ప్రభావం ఎంతవరకు ఆందోళన , నిస్పృహ చాలావరకు తగ్గిస్తుందో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం జర్నల్ హ్యూమన్ సైకోఫార్మకాలజీలో వెలువడింది. ఈ సప్లిమెంట్స్ వినియోగించడం వల్ల మానసిక రుగ్మతల నివారణకు లేదా చికిత్సకు సంబంధించి మెదడులో చైతన్య స్థాయిల్లో చాలా మార్పు కన్పించిందని ప్రయోగాల ద్వారా రుజువైందని అధ్యయనం వెల్లడించింది.
మెదడులో ఉత్తేజకరమైన న్యూరాన్ల మధ్య సున్నితమైన తులనాత్మకత పైనే మెదడు పనిచేసే విధానాలు ఆధారపడి ఉంటాయని, చుట్టూ ఉండే నిరోధకాలను నివారించే సమచారం మెదడు ద్వారా ప్రసారమౌతుందని అధ్యయన శాస్త్రవేత్త డేవిడ్‌ఫీల్డ్ చెప్పారు. ఈ నేపథ్యంలో విటమిన్ బి6 శరీరంలో నిర్ధిష్టమైన రసాయన వాహకాన్ని ఉత్పత్తి చేసి అది మెదడులో రుగ్మతల ప్రేరణలను నిరోధించేలా చేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. దాదాపు 300 మందిపై ఈ అధ్యయనం జరిగింది. విటమిన్ బి6 లేదా బి 12 రోజూ ఇచ్చే మోతాదు కన్నా ఏబై సార్లు ఎక్కువగా అందించి ఫలితాలను కనుగొన్నారు. విటమిన్ బి 12 కన్నా విటమిన్ బి6 అత్యంత ప్రభావం చూపించిందని నిర్ధారించారు.