Wednesday, January 22, 2025

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు!

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఉన్నత న్యాయ వ్యవస్థకు మధ్య మౌలికమైన వైరుధ్యాలు తరచూ వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల దృక్పథానికి ప్రభుత్వం తరపు వాదనకు పొసగకపోడం కొన్ని కేసుల విచారణ సమయంలో కనిపిస్తున్నది. రాజ్యాంగ పరమ ధర్మమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గల ఉన్నత న్యాయ వ్యవస్థకూ, హిందూత్వ దృష్టి గాఢంగా వున్న పాలకుల ధోరణికి ఇటువంటి ఘర్షణ సహజమే. మొన్న ఆదివారం నవంబర్ 26న రెండు వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతి ప్రసంగాలు న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులను మన పెద్దలు ఆశిస్తున్నారో తెలుసుకొనే అవకాశం కల్పించాయి. ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతమున్న కొలీజియం విధానంపై కేంద్ర పాలకులు తరచూ ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి నేరుగా ఈ వివాదంలోకి పోకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన సూచన కొలీజియం వ్యవస్థ కొనసాగరాదని ఆమె కూడా కోరుకొంటున్నారా అనే ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తున్నది. రాజ్యాంగ వార్షిక దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సివిల్ సర్వీసుల మాదిరిగానే జ్యుడిషియల్ సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు. మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ మున్నగు రంగాల్లో చదువుతున్న తెలివైన విద్యార్థులందరికీ న్యాయ వ్యవస్థలో ప్రవేశం కల్పించడానికి జ్యుడిషియల్ సర్వీసులు ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం న్యాయ విద్యలో పట్టభద్రులైన వారికి మాత్రమే న్యాయవాదులు, న్యాయమూర్తులు కావడానికి అవకాశం కలుగుతున్నది. నాలుగైదేళ్ళ న్యాయ శాస్త్ర అధ్యయనం ద్వారా పట్టభద్రులయ్యే న్యాయవాదులకుండే ప్రావీణ్యం అన్య విద్యా రంగాల్లో పట్టభద్రులైన వారికి ఎలా సంక్రమిస్తుందనేది కీలకమైన ప్రశ్న.

ఏ రంగంలో పట్టభద్రులైన ఎంతటి తెలివైన విద్యార్థులైనా న్యాయ శాస్త్రంలో లోతైన అధ్యయనం చేయకుండా ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తులు ఎలా కాగలుగుతారు? భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఎప్పుడూ ప్రజా న్యాయస్థానంగానే వున్నదని, అలాగే కొనసాగుతున్నదని అన్నారు. సామాన్యులు ఒక్క ఉత్తరం ద్వారా తమ సమస్యను తెలియజేసుకొంటే దానిని స్వచ్ఛందంగా స్వీకరించి విచారణ జరిపి న్యాయం చేసే మంచి సంప్రదాయం సుప్రీం కోర్టుకున్నదని చెప్పుకొన్నారు. బిఆర్ అంబేడ్కర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలోనివారు అట్టడుగున వున్న అణగారిన ప్రజానీకంతో సంబంధాలు పెట్టుకోవాలన్నారు.

న్యాయవాద వృత్తిని మరింత సమ్మిళితంగా మార్చడం అవసరమన్నారు. అలాగే ఉన్నత న్యాయ వ్యవస్థలో తగినంత మంది మహిళలు లేకపోడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వృత్తిలో ప్రవేశించడానికి జరిపే పరీక్ష ఆంగ్లంలో వుండడం వల్ల ఇది ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాల వారికే అందుబాటులో వుంటున్నదని, గ్రామీణ పేద వర్గాల నుంచి వచ్చే విద్యార్థులకు దూరమైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవాద వృత్తిలో సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించవలసిన అవసరాన్ని గురించి గట్టిగా చెప్పారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖడ్ కేంద్ర న్యాయశాఖ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సభలో మాట్లాడుతూ తన పాత పాటనే మళ్ళీ పాడారు. పార్లమెంటు సార్వభౌమత్వంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోడం తగదని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన న్యాయ నియామకాల చట్టాన్ని రద్దు చేసి సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థకు తిరిగి ప్రాణం పోయడాన్ని ఆయన గతంలో సవాలు చేశారు.

దానికి కొనసాగింపుగానే ఇప్పుడీ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ ముగ్గురి ప్రసంగాలను తరచి చూస్తే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని కాపాడవలసిన బాధ్యత రీత్యా సుప్రీం కోర్టుకు కొన్ని ప్రత్యేక అధికారాలు వుండాలన్న వాదనను కేంద్రంలోని పెద్దలు వ్యతిరేకిస్తున్నారని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది. ఇది స్థూలంగా కొలీజియం చుట్టూ తిరిగిన విషయం కూడా స్పష్టపడుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొలీజియంకు స్వస్తి చెప్పాలనే దృఢాభిప్రాయంతో బిజెపి ప్రభుత్వం వున్నట్టు బోధపడుతున్నది. సిజెఐ చెప్పిన సమ్మిళిత తత్వం, ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం అనేవి కేవలం మహిళలకు ప్రాతినిధ్యం పెంచడం వల్లనే జరిగే పనులు కావు. న్యాయ నియామకాల్లో అణగారిన సామాజిక వర్గాలన్నింటికీ తగిన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. న్యాయం సామాన్యులకు చేరువ కావాలంటే ఇంకా అనేక మార్పులు తేవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News