Monday, December 23, 2024

అవినీతికి రీ‘ఫండ్’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జిఎస్‌టి రీఫండ్‌ల ముసుగులో కొందరు అక్రమార్కులు ప్ర భుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే కమీషన్‌లకు కక్కుర్తిపడి గత ప్రభుత్వ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు అనర్హులకు జిఎస్‌టి రీఫండ్లు ఇచ్చినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. తప్పుచేసిన ఒకరిద్దరు డీలర్లు అధికారులపై ఫిర్యాదు చేయడం తో ఈ విషయం కాస్త బయటపడింది.దీంతో అప్రమత్తమైన ప్రస్తుత వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవి అధికారులతో సమీక్షలు నిర్వహించి బోగస్ సంస్థలకు ఇచ్చిన రీఫండ్‌లపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు సీనియర్ అధికారులతో విచారణ చేపట్టింది.
ఈ బైక్‌ల తయారీ, టాల్కమ్ పౌడర్ ఉత్పత్తి సంస్థల మాటున రాష్ట్రంలో ఈ బైక్‌ల తయారీ, టాల్కమ్ పౌడర్ ఉత్పత్తి సంస్థల మాటున కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సొమ్మును భారీగా జేబులో వేసుకున్నారు. నెల నెలా జీతం తీసుకున్న అధికారులు సైతం అక్రమార్కులతో చేతులు కలిపి కమీషన్లకు ఆశ పడి ఇష్టానుసారంగా రీఫండ్లు ఇచ్చినట్టు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 14 డివిజన్లు ఉంటే ఈ రీఫండ్‌ల బాగోతం ఎక్కువగా హైదారాబాద్‌లోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఎక్కువగా చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ నుంచి కింది స్థాయి డిసిటిఓ వరకు కమీషన్ల పంపకం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక అంచనా మేరకు మూడు నుంచి నాలుగు కేసుల్లో దాదాపు రూ.100కోట్లు ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం.
బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి…జిఎస్‌టి లైసెన్స్‌లను తీసుకొని…
ఈ బైక్ అమ్మకాలను ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 శాతం జిఎస్‌టి మాత్రమే వాటిపై వేస్తోంది. దీనిని ఆసరాగా చేసున్న పలువురు అక్రమార్కులు బోగస్ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి తయారికి జిఎస్‌టిలైసెన్స్‌లను తీసుకున్నారు. కాగా ఈ లైసెన్స్ ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయకుండానే లైసెన్స్ ఇచ్చేశారు. ఆ తరువాత ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయలేదు. అక్రమార్కులు బయట నుంచి ఈ బైక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లుగా, వాటి విలువపై 18శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్ వాయిస్‌లను సృష్టించి వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ తరువాత విడిభాగాలను అసెంబుల్ చేసి ఈ బైక్‌లను విక్రయించినట్లు చూపించారు. ఈ బైక్‌ల విలువపై 5శాతం జిఎస్‌టితో అమ్మినట్లు బిల్లులు సృష్టించారు. అయితే విడిభాగాల విలువపై చెల్లించిన 18శాతం జిఎస్‌టిలో ఈ బైక్‌ల విలువపై వచ్చిన 5శాతం నగదును మినహాయించి మిగతా 13శాతం నగదును ప్రభుత్వ ఖజానా నుంచి రీఫండ్ కింద తీసుకోవడాని కేంద్రం జీఎస్టీ చట్టంలో వెసులుబాటు కల్పించింది. దీనినే అక్రమార్కులు ఆసరాగా చేసుకున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.
కాగితాల మీదనే వ్యాపారం కావడంతో అందినంత లంచం
డీలర్లు రీఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ఉంచింది. అదే విధంగా వాటికి అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖ కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ రెండింటిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తుదారు నివేదించిన వివరాలు కచ్చితమని నిర్ధారించుకున్న తరువాతనే రీఫండ్లు మంజూరు చేయాలి. కానీ, ఇక్కడ అది జరగలేదు. కోటి రూపాయలు రీఫండ్ ఇస్తే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కమీషన్లు తీసుకున్నట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వ్యాపారం చేసే డీలర్లు అయితే ఇంత కమీషన్లు ఇవ్వడానికి ముందుకురారు. కానీ, ఇక్కడ రుపాయి పెట్టుబుడి పెట్టకుండా కాగితాలపై బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వ సొమ్మును దోచేయడంతో అధికారులు అడిగినంత కమీషన్ ఇచ్చి వాటిని మంజూరు చేయించుకున్నారు. ఈ వ్యవహారమంతా గత ప్రభుత్వ హయాం 2022 జూలై నుంచి నవంబరు 2023 వరకు కొనసాగడం విశేషం.
అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదు..?
మాదాపూర్ సర్కిల్ పరిధిలో ఓ అధికారిని 2022 నవంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు ఓ బోగస్ డీలర్ రూ.14 కోట్లుకుపైగా రీఫండ్ ఇచ్చేశారు. అదే విధంగా మరో అధికారి 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు దాదాపు రూ.26 కోట్లు మరో బోగస్ డీలర్‌కు, ఇంకో అధికారి 2022 నవంబర్ నుంచి గతేడాది ఆగస్టు వరకు ఇంకో బోగస్ డీలర్‌కు దాదాపు రూ.19 కోట్ల రీఫండ్లు ఇచ్చారు. ఈ ముగ్గురు అధికారులు కలిసి దాదాపు ఇలా రూ.100 కోట్లు మేర అనర్హులకు ప్రభుత్వ సొమ్మును దోచి పెట్టారు. డీలర్ల నుంచి భారీ మొత్తంలో అధికారులు కమీషన్లు తీసుకున్నారు. ఈ మధ్యలో పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. ఓ అధికారి ఇక్కడ నుంచి నల్గొండ డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఎక్కడ తన అవినీతి భాగోతం బయట పడుతుందోనన్న భయంతో పాటు తనకు రావాల్సిన కమీషన్లు వేరొకరికి పోతాయన్న భావనతో ఏకంగా ఆ డీలర్ చిరునామా తన పరిధిలోకి మారినట్లు చూపి రీఫండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఓ అధికారి చేసిన నిర్వాకం బయటకు పొక్కడంతో ఆ అధికారి ఓ డీలర్‌కు నోటీసు ఇచ్చి పిలిపించారు. ఆ డీలర్ రూ.65 లక్షలు చెల్లించగా మిగిలిన సొమ్ము తన ఆస్తులు అమ్మి చెల్లిస్తానని కొంత సమయం కావాలని కోరినా వినకుండా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ డీలర్ బెయిల్‌పై బయటకు వచ్చి ఈ అవినీతి భాగోతంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు బిల్లులు పెట్టి రీఫండ్ తీసుకున్నందుకు తాను ఆ మొత్తాలను చెల్లిస్తానని చెప్పినా వినకుండా తనను అరెస్టు చేశారని కానీ, ఎందుకు తప్పుడు ఇన్ వాయిస్లు పెట్టి రీఫండ్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News