Wednesday, January 22, 2025

అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్ ఇవ్వాలిందే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒక కాలేజీలో సీటు పొందిన తర్వాత.. మళ్లీ రెండో విడతలో మరో కాలేజీలో సీటు పొందిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యుజిసి) కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో సీటు రావడంతో ఫీజు చెల్లించిన విద్యార్థులు, మళ్లీ రెండో విడతలో వేరే కాలేజీలో సీటు పొందితే.. మొదటగా చెల్లించిన ఫీజును సదరు విద్యార్థి పొందలేకపోతున్నారు. వేరే కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేందుకు ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగిస్తూ యుజిసి కీలక నిర్ణయం తీసుకుంది.2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు రీఫండ్ పొందేందుకు యుజిసి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా.. మరో కాలేజీలో చేరినా విద్యార్థులు చెల్లించిన పూర్తి ఫీజును తిరిగి ఇవ్వాలని ఉన్నత విద్యాసంస్థలను యుజిసి ఆదేశించింది. విద్యాసంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏ నిబంధనలున్నా.. వాటితో సంబంధం లేకుండా సెప్టెంబర్ 30లోపు విద్యార్థులు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా, మరో కాలేజీకి మారినా ఫీజు మొత్తాన్ని సంబంధిత విద్యార్థి ఖాతాకు బదలాయించాలని యుజిసి తెలిపింది. ఇక విద్యార్థి అక్టోబర్ 31లోపు అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. వెయ్యి మాత్రమే మినహాయించుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్ 31 తర్వాత అడ్మిషన్ల రద్దు, ఫీజుల వాపస్‌కు సంబంధించి యుజిసి కొన్ని స్లాబులను విధించింది. అడ్మిషన్ల గడువు పూర్తయ్యి 30 రోజుల ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫీజుల వాపసు చేయరని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News