Monday, December 23, 2024

మహిళా బిల్లు నెగ్గేలా చేద్దాం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోమవారం నుంచి ఆరంభమయ్యే పార్లమెంట్ ఐదురోజుల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు కానుంది. ఈ సెషన్‌లో అయినా మహిళా కోటా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని అధికార పక్షం సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌లోని లైబ్రరీ బిల్డింగ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీల ఫ్లోర్ లీడర్స్ మహిళా బిల్లు గురించి ప్రస్తావించారు. కెసిఆర్ నాయకత్వపు బిఆర్‌ఎస్, బిజెడి వంటి పలు ప్రాంతీయ పార్టీలు కూడా మహిళా బిల్లుపై ఈ సమావేశంలో గళమొత్తాయి. మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో నిలదీయాలని శుక్రవారం జరిగిన బిఆర్‌ఎస్ పార్లమెంటరీ స్థాయి భేటీలో కెసిఆర్ తమ పార్టీ ఎంపిలకు దిశానిర్ధేశనం చేశారు. మహిళా బిల్లు చిరకాలంగా పెండింగ్‌లో ఉందని పార్టీలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. ఇకనైనా బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిని ఏకాభిప్రాయ సాధనతో ఆమోదింపచేసుకోవల్సి ఉందని పార్టీలు తెలిపాయి.

లోక్‌సభ రాష్ట్రాల చట్టసభలైన అసెంబ్లీల్లో మహిళకు 1/3 కోటాను కల్పించాలనేది మహిళా బిల్లులోని ప్రధానాంశం. చట్టసభలలో ఇంతకాలం మహిళకు తగు ప్రాతినిధ్యం లేకుండా పోతోందని, ప్రభుత్వం వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నందున కీలకమైన ఈ బిల్లు వచ్చేలా నెగ్గేలా చూడాల్సి ఉందని పార్టీలు తెలిపాయి. ఈ సెషన్‌లోనే మహిళా బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయని ఆ తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి తెలిపారు. బిజెపి మిత్రపక్ష ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ఈ సెషన్‌లో బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. పార్లమెంట్‌లో దీనిని ప్రవేశపెడితే ఏకాభిప్రాయంతో ఇది నెగ్గితీరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది రెగ్యులర్ సెషన్ అని, ప్రత్యేకం ఏమీ కాదని ప్రభుత్వం తెలిపిందని , కాగా కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశం గణేష్ చతుర్థి దశలో మంగళవారం జరుగుతుందని తెలిసిందని చెప్పారు. అయితే ఇప్పటికీ తమకు ప్రభుత్వం ఉద్ధేశం గురించి పూర్తి స్థాయిలో తెలిసిరాలేదని , సరికొత్త అజెండాతో అందరిని ఆశ్చర్యచకితులు చేసినా చేయవచ్చునని తెలిపారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, సరిహద్దులలో చైనాతో వివాదాలు వంటి కీలక విషయాలు కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. అఖిల పక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీలు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. మాజీ ప్రధాని, జెడిఎస్ జాతీయ స్థాయి నాయకులు హెచ్‌డి దేవెగౌడ, బిఆర్‌ఎస్ నుంచి కె కేశవరావు, డిఎంకె నుంచి కనిమొళి, టిడిపికి చెందిన రామ మోహన్ రెడ్డి, టిఎంసి తరఫున డెరెక్ ఓ బ్రెయిన్, ఆప్ నేత సంజయ్‌సింగ్, బిజెడి నుంచి సస్మిత్ పాత్ర, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, జెడయు నుంచి అనిల్ హెగ్డే , ఎస్‌పి ఎంపి రామ్ గోపాల్ యాదవ్ ఇతరులు అఖిలపక్షభేటీకి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News