Saturday, November 23, 2024

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్యాసేన్ స్పష్టం చేశారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకు ముందులాగా ఫలితం బిజెపి వైపు ఏకపక్షంగా ఉంటుందనుకుంటే అది పొరపాటే అవుతుందని ఆయన తెలిపారు. ఇంతకు ముందులాగా ఇప్పుడు ఒంటెద్దు పోకడలు లేవన్నారు. ఈసారి ఖచ్చితంగా పలు ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం అవుతుంది. అధికార స్థాపన విషయంలో ఈ పార్టీలు నిర్ణయాధికార పాత్ర వహిస్తాయని విశ్లేషించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమత బెనర్జీ దేశానికి తదుపరి ప్రధాని అయ్యే సమర్థతను సంతరించుకుంటున్నారని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఆమె భావి ప్రధాని అవుతారనేది చెప్పలేమని ఈ 90 ఏండ్ల ఆర్థికవేత్త తమ రాజకీయ విశ్లేషణలో వివరించారు. బిజెపి పట్ల ప్రజా వ్యతిరేకతను ఆమె తనకు అనుకూలంగా మల్చుకుంటుందా? మోడీ వ్యతిరేక శక్తులను తనతో పాటు తీసుకువెళ్లగల్గుతుందా? అనేది కీలక ప్రశ్న అని చెప్పారు.

దేశంలో పలు ప్రాంతాలలో అక్కడి పార్టీలు ప్రాబల్యం చాటుకుంటున్నాయి. రాజకీయ కోణంలో చూస్తే డిఎంకె ప్రధాన పార్టీ అవుతుంది. టిఎంసి అత్యంత కీలకం అవుతుంది. సమాజ్‌వాది పార్టీ కూడా కొంత మేరకు బలోపేతం అవుతుంది. అయితే ఏ స్థాయిలో దీని ప్రభావం ఉంటుందని చెప్పలేమన్నారు. బిజెపి స్థానంలో మరో పార్టీ రాదని అనుకోరాదని, ఈ పార్టీ పూర్తిస్థాయిలో హిందూత్వ వైపు , హిందువుల వైపు మొగ్గుచూపుతున్న పార్టీగా నిర్థారణ అయింది. దీని ప్రతికూలత, అనుకూలత ప్రభావాలు ఉండనే ఉం టాయని ఓ ప్రత్యేక ఇంటర్వూలో సేన్ తెలిపారు. కాం గ్రెస్‌తో పాటు పలు పార్టీల కూటమి ఒకటి అవతరించాలని, ఎన్నికలలో ఈ కూటమికి బిజెపికి మధ్య కేవలం ద్వంద్వ పోరు ఉంటే కేంద్రంలో అధికార మార్పిడి జరుగుతుందని ఎన్‌సిపి, జెడియు ఇతర పార్టీల నేతలు పలుసార్లు చెపుతూ వస్తున్నారు. బిజెపి ఇప్పుడు విజన్ ఇండి యా నుంచి దూరం అయింది. ఇది క్రమేపీ హిందూత్వ వైపు ఒరుగుతోంది. చివరికి బిజెపి వైఖరి సంకుచితం అయ్యి, ఇండియా అంటే హిందూ ఇండియా అని భావిస్తోంది. భారత్‌లో హిందీ మాట్లాడే ప్రాంతాలలో బిజెపికి తిరుగులేదనే భావన నెలకొంటే అది పొరపాటే అవుతుంది, చింతించాల్సి వస్తుందని అమర్తాసేన్ తెలిపారు.

బలాలు బలహీనతలున్న బిజెపి

ఓ వైపు బిజెపికి బలమున్నా మరో వైపు బలహీనతలు ఉండనే ఉన్నాయని సేన్ అభిప్రాయపడ్డారు. తాను ఏదైతే బలీయమైన అంశం అనుకుని ఈ పార్టీ వ్యవహరిస్తుందో అదే అంశం ఈ పార్టీకి గుదిబండ కావచ్చునని, సార్వత్రిక కోణంలో ఓ విధంగా అన్నించే రూపం విభిన్న స్థాయిలో వేర్వేరుగా తోచవచ్చునని తెలిపారు. ఈ దశలో ఇతర రాజకీయ పార్టీలు నిజంగా ఓ క్రియాశీలక చర్చకు దిగితే ప్రత్యామ్నాయం ఉంటుందన్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలు ఒక్కటి కాబోవనే వాదన సరికాదని అన్నారు. మమత తదుపరి ప్రధాని అయ్యే దశలో ఉన్నారని, అయి తే ఈ విషయం నిరూపితం కావడానికి పలు ఇతర అం శాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. దేశంలో తలెత్తుతున్న విభజన రేఖల పరిస్థితికి ఆమె అంతం పలుకగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల దశలో కెసిఆర్ నాయకత్వపు టిఆర్‌ఎస్, ఆప్ ఫెడరల్ ఫ్రంట్‌ను బిజెపికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశామని సేన్ గుర్తు చేశారు. ఈ దశలో కోల్‌కతాలో పలు పార్టీల నేతల సమావేశం జరిగిందన్నారు.

కాంగ్రెస్ ఒంటిరిగా ఏమి చేయలేదు

కాంగ్రెస్ ఇప్పుడు బలహీనంగానే ఉందని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగితే సత్ఫలితాలు సాధించడం కష్టం అని సేన్ తెలిపారు. ఈ పార్టీకి ఇతర పార్టీలు సహకరించడం లేదా, ఇతర పార్టీలకు ఈ పార్టీ గౌరవం ఇవ్వడం వల్ల జాతీయ స్థాయిలో మార్పు ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బాగా డీలా పడింది. ఈ దశలో ఈ పార్టీని ఎవరైనా ఈ పార్టీని నమ్ముకుంటారా? అనే ప్రశ్న వస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఇండియా విజన్ ఉందని , జాతీయ దృక్పథాన్ని ప్రతిబింబించగలిగే పార్టీ ఇదొక్కటే అవుతుందని సేన్ స్పష్టం చేశారు.

ముస్లింల పట్ల దారుణ అణచివేతలు

దేశంలోని ముస్లింల పట్ల బిజెపి వైఖరి దారుణంగా ఉందన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ పార్టీకి ఏ ముస్లిం ఎంపి లేడని తెలిపారు. ఇది బాధాకరమైన విషయం అని, పార్టీ వైఖరి క్రమేపీ ముస్లింలపై దాడులు, హిందూ రాజ్యస్థాపనం దిశకు సాగుతోందని అన్నారు. భారతదేశం ఎప్పుడూ విభిన్న బహుళ తెగల దేశం, అయితే దీనిని కాదంటూ మోడీ ప్రభుత్వం మతతత్వ, ఆధిక్యవాద విధానాలకు పాల్పడుతోందని దీని ద్వారా చివరికి భారతదేశాన్ని దిగజార్చే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకంటే జాతీయ ఉపద్రవం మరోటి ఉండదన్నారు. హిందువులే భారతీయులు ఇతరులు ఎవరూ కాదని చెప్పడం దారుణం అన్నారు. కేబినెట్ మంత్రులు, చివరికి సిఎంలు కూడా ముస్లింలను బాబర్ కీ ఔలాద్ అని ,పాకిస్థాన్‌కు వెళ్లిపోండని, వారు చెదపురుగులుగా వచ్చిచేరారని అనడం క్రూరమే అవుతుందన్నారు.

దేశం అంటే ఏమిటనేది మోడీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తెలియని అంశం అయిందన్నారు. దేశంంలో ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లలో తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ప్రాధాన్యత లేనే లేదన్నారు. ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపిఎస్‌లలో , పారామిలిటరీ సర్వీస్‌లలో సంఖ్య తక్కువగా ఉందన్నారు. 28 రాష్ట్రాలలో ఏ ముస్లిం సిఎం లేరని , 15 రాష్ట్రాలలో ముస్లిం మంత్రులు లేరని తెలిపారు. దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లింలు వారి హక్కుతో కాకుండా మెజార్టీ వర్గాల దయా భిక్షతోనే దేశంలో పౌరులుగా ఉండగల్గుతున్నారనే పరిస్థితిని కల్పిస్తున్నారని తెలిపారు. ఇరాన్, అఫ్ఘనిస్థాన్, రష్యా ఇతర దేశాలలో ప్రభుత్వాలతో పోల్చుకుంటే భారతదేశం పరిస్థితి బాగా ఉందనే ధోరణిలో మాట్లాడుకుంటే అది దేశ ప్రజలకు సముచితం కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News