ఐదు ప్యాకేజీల్లో ఉత్తర భాగం పనులు
తొలి దశలో నాలుగు వరుసలుగా నిర్మాణం
ఉత్తర భాగం మొత్తం వ్యయం అంచనా రూ. 7,104.06 కోట్లు
మారనున్న గ్రామాల రూపు రేఖలు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్ నిలవనుంది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా సగం తెలంగాణను చుట్టేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను సైతం ఆహ్వానించింది. గ్రీన్‌ఫీల్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ ప్రాజెక్టును తొలి దశలో నాలుగు వరుసలుగా నిర్మించనుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు.
ఉత్తర భాగం మొత్తం వ్యయం అంచనాను రూ. 7,104.06 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఉత్తరభాగంలో నిర్మించే రీజినల్ రింగు రోడ్డుకు 11 జాతీయ, రాష్ట్ర రహదారులు కనెక్ట్ కానున్నాయి. మహానగరం హైదరాబాద్‌తో పాటు నగర శివారులోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. వివిధ జిల్లా కేంద్రాలకు కూడా తక్కువ సమయంలోనే నేరుగా చేరుకోవచ్చు. అంతర్రాష్ట్ర వాహనాలకు దూరాభారం చాలా వరకు తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డుకు అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ వ్యాపారరంగం మరింత వృద్ధి చెందనుందని చెబుతున్నారు.
మారనున్న గ్రామాల రూపు రేఖలు : ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా నిర్మించనున్నారు. భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ రహదారిని నిర్మించనుంది. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఎన్‌హెచ్ డివిజన్ సూచనలు, సలహాలు కూడా తీసుకుని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు నేషనల్ హైవేలు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం 11 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టోల్‌ప్లాజాలు, రెస్ట్‌రూంలు, సర్వీసు రోడ్లు, బస్‌బేలు, ట్రక్ బేలు నిర్మించనున్నారు. ప్రస్తుతం 4 లైన్ హైవేగా నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో ఆరు, ఎనిమిది వరుసలుగా పెంచుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఫోర్త్ సిటీ ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దనుంది. రాష్ట్రంలోని తొలి నెట్ జీరో సిటీ ఇదే కానుండడం గమనార్హం. నాలుగో నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఎయిర్‌పోర్ట్ నుంచి ఓఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ నుంచి ఫోర్త్ సిటీ ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నారు.
ప్రతిపాదిత ప్రాంతాలైన బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట్, ముచ్చెర్ల వరకు 330 అడుగుల వెడల్పుతో దారులు వేయనున్నారు. రావిర్యాల ఓఆర్‌ఆర్ నుంచి మీర్‌ఖాన్ పేట, ముచ్చర్ల, ఆమన్‌నగర్ మండలం ఆకుతోటపల్లె వద్ద ఆర్‌ఆర్‌ఆర్ కలుపుతో 40 కిలోమీటర్లు ఇందులో ఉంది. అలాగే రాజేంద్రనగర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఆ మూడు గ్రామాలు బంగారమయం కానున్నాయి. అక్కడి భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి.
4000 ఎకరాల్లో నెట్ జీరో సిటీ నిర్మాణం : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట, బేగరికంచె గ్రామాల్లోని 4000 ఎకరాల్లో నెట్ జీరో సిటీ నిర్మాణం జరగనుంది. వచ్చే 50 సంవత్సరాల వరకు మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో దశల వారీగా ఈ సిటీ అందుబాటులోకి రానుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాటి కోసం 9 వేల ఎకరాలు కేటాయించనున్నారు.
లైఫ్ సైన్సెస్ జోన్‌లో ప్రాణాధార మందుల ఉత్పత్తి, పరిశోధన చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బేగరికంచె ప్రాంతంలో విశ్వ విద్యాలయ జోన్, వాణిజ్య నివాసాలు నిర్మాణం కోసం ఇప్పటికే భూముల ఎంపిక జరిగినట్లు సమాచారం. వినోద జోన్లు, నివాస ప్రాంతాలు, పరిశ్రమలు వంటి వాటి కోసం విద్యుత్తు సరఫరాపై ప్రణాళికలు వేస్తున్నారు.
13,972 ఎకరాల్లో నగరం నిర్మాణం : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్, ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతాల్లో నాలుగో సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం 13,972 ఎకరాల్లో ఈ నగరం నిర్మాణం కానుంది. ఇందులో వివిధ విభాగాలు, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించనున్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నెట్ జీరో సిటీలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. వాణిజ్య పంటలు, చెట్లు, రహదారుల వెంట మొక్కల పెంపకం వంటివి ఉండనున్నాయి. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరంతో పోలిస్తే నాలుగో నగరంలో ఉష్ణోగ్రతలను 2-3 డిగ్రీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన జరుగుతోంది. వ్యర్థ జలాలను శుద్ధీకరించి పునర్వినియోగించేందుకు వీలుగా టెక్నాలజీని ఉపయోగించనున్నారు.