Wednesday, January 22, 2025

పోలీసు అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి అమల్లోకి తేవడంతో పాటు ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) మాదిరిగానే తొలుత టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రాథమిక వివరాలతో మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుందని, పోలీసు ఉద్యోగాలకు కిందటిసారి (2018) నియామకాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఈక్రమంలో ఇటీవల ప్రకటించిన ఖాళీలకు సంబంధించి గతంలో కంటే ఎక్కువగానే దరఖాస్తులొస్తాయని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా సర్వర్లలో లోపం తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేశామని, దరఖాస్తుల ప్రక్రియ మొదలైన రోజే 15 వేల దరఖాస్తులు నమోదు కావడంతో పోటీ అధికంగా ఉంటుందని టిఎస్‌ఎల్ పిఆర్‌బి అధికారులు ముందస్తుగా అంచనా వేసినట్లు తెలిపారు.

ఇదిలావుండగా పోలీసు నియామకాల్లో పోటీపడే బయటి రాష్ట్రాల అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను నియామక మండలి వెల్లడించింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏ సామాజికవర్గానికి చెందినా వారిని ఒసిలుగానే పరిగణించనున్నట్లు పేర్కొంది. కొత్త ప్రెసిడెన్షియల్ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో అయిదు శాతం మాత్రమే నాన్‌లోకల్ కేటగిరీగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ అయిదు శాతం కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుందని ఎస్‌ఎల్‌పిఆర్‌బి ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News