Monday, December 23, 2024

నిషేధిత జాబితాలోని ఆస్తులకు త్వరలో మోక్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:నిషేధిత జాబితాలో పొరబాటున చేర్చిన ప్లాట్లు, ఖాళీ స్థలాలు, ఇళ్ల, వ్యవసాయ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు చర్యలు చేపట్టారు. నిషేధిత జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని ప్రజలు భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కార్డులో చేర్చిన నిషేధిత జాబితాకు సంబంధించి అధికారులు సమీక్షిస్తున్నారు.

దీనికోసం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లతో కూడిన కమిటీ సమీక్ష జరిపింది. నిషేధిత జాబితాలో వీటిని ఏ కారణాలతో చేర్చారు..? కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా! ఆ కేసులు ఏం చెబుతున్నాయి? నిషేధిత జాబితాలో భూములు పెట్టాల్సిన అవసరమేమిటీ ?జాబితా నుంచి తీసేయాల్సి వస్తే దానికి కారణాలు ఏమిటీన్న తదితర అంశాలపై అధికారులు సమీక్ష జరిపారు. అయితే ఖాస్రా నుంచి పహాణీ దాకా అన్ని రికార్డులను దగ్గర పెట్టుకొని నిషేధిత జాబితా నుంచి ఆయా నెంబర్‌లను తొలగిస్తున్నారు.
‘కార్డు’లో నిషేధితం, ధరణిలో పాసు పుస్తకం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కంప్లీట్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ( కార్డ్ సిస్టం) వ్యవస్థను అమలు చేస్తోంది. అయితే 2020 సెప్టెంబర్ వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అంతా కార్డ్ (సబ్ రిజిస్ట్రార్ల) వెబ్‌సైట్ ద్వారా జరగ్గా 2020 అక్టోబర్ నుంచి ధరణి వెబ్ సైట్ (తహసీల్దార్ల) ద్వారా జరుగుతోంది. అయితే పలు భూములు కార్డు సిస్టం నిషేధిత జాబితాలో ఉండగా ధరణిలో మాత్రం పట్టా భూములుగా, ఆ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా, రైతుబంధు కూడా అందుతోంది. అయితే కార్డులో నిషేధిత జాబితాలో పెట్టి ధరణిలో లావాదేవీలకు అనుమతించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో కార్డు వెబ్‌సైట్‌లో చేర్చిన భూములను సమీక్షించే పనిని ప్రభుత్వం తీసుకుంది.
ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు కూడా….
ధరణి వెబ్‌సైట్ ప్రారంభించినప్పుడు కొన్ని సర్వే నెంబర్‌లు నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రభుత్వ భూమి, ఎండోమెంట్, భూదాన్ భూములు, గ్రామకంఠం, కార్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, రైల్వే ట్రాక్ నిర్మాణాలు, చెరువులకు సంబంధించి శిఖం భూమిని, ఫారెస్ట్ భూములను, పోరంబోకు, బంజర, సీలింగ్ భూములను ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. అయితే వీటితో పాటు ప్రైవేటు భూములను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ జాబితాలను కలెక్టరేట్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
రెండేళ్లుగా భారీగా ఫిర్యాదులు
అప్పటి నుంచి ఆయా ప్లాట్లను, ఇళ్లను, ఖాళీ స్థలాలను, వ్యవసాయ భూములను అమ్ముకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రెండేళ్లుగా ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతుండడంతో అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదిక సైతం అందించింది. ఈ నివేదిక ఆధారంగా నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నెంబర్‌లు, ప్లాట్ నెంబర్‌లు, ఇంటి నెంబర్‌లపై సమీక్ష జరిపి వెంటనే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులకు సూచించడంతో అధికారులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఈ నిషేధిత జాబితాలో వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, కామారెడ్డి, ములుగు, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News