‘ఈ -సహకార’ సేవ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం
తెలంగాణ సహకార శాఖ అందిస్తున్న
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవాలి
సహకార శాఖ కమిషనర్ వీర బ్రహ్మయ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : సులభతర విధానంలో భాగంగా సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సహకార శాఖ ఆధ్వర్యంలో ‘ఈ -సహకార’ సేవ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. అందులో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ మేరకు సహకార సంఘాల రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య దీనిని శనివారం అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకొని తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964, పరస్పర సహకార సంఘాల చట్టం 1995 ద్వారా సహకార సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ప్రజలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయగానే నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించి ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, సంబంధిత రిజస్ట్రర్ బైలాలను రిజిస్ట్రార్, జిల్లా సహకారం అధికారి దరఖాస్తు దారుడికి ఆన్‌లైన్‌లోనే పంపించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సమష్టి వ్యక్తుల శ్రేయస్సు, అభివృద్ధి కోసం సంఘకార సంఘాలను ఏర్పాటు చేసుకొని తెలంగాణ సహకార శాఖ అందిస్తున్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకో వాలని సహకార శాఖ కమిషనర్ వీర బ్రహ్మయ్య తెలిపారు.