మన తెలంగాణ / హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోనే లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసిబికి పట్టుబడడం సంచలనం సృష్టించింది. వివరాలు ఇవీ.. జయశంకర్ భూపాలజిల్లా రేగొండ మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మండల ప్లానింగ్ , స్టాటిస్టికల్ అధికారి మంగళవారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
చనిపోయిన వ్యక్తి (తన అత్తమ్మ) డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ రేగొండ వ్యాపారి వడ్లకొండ మల్లికార్జున్ (50) దరఖాస్తు చేసుకోగా ఇందుకు గాను మండల ప్లానింగ్ , స్టాటిస్టికల్ అధికారి మెగుళ్ల రఘుపతి (32) రూ. 2 వేలు లంచం ఇవ్వాలని కోరడంతో సదరు వ్యక్తి ఏసిబికి సమాచారం అందించాడు. దీంతో ఏసిబి సూచనల మేరకు సదరు అధికారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉండగా రూ. 2 వేలు లంచంగా అందజేశారు. ఇదే సమయంలో మఫ్టిలో ఉన్న ఏసిబి పోలీసులు సదరు అధికారిని అరెస్టు చేసి హైదరాబాద్ ఎస్‌పిఈ ఏసిబి ఫస్ట్ క్లాస్ అడిషనల్ స్పెషల్ జడ్జి ముందు ప్రవేశ పెట్టి అనంతరం జైలుకు తరలించారు.