ప్రోస్టేట్ క్యాన్సర్‌కు హడావిడిగా తొందరపడి శస్త్రచికిత్స చేయడం కన్నా ఎప్పటికప్పుడు చురుకుగా పర్యవేక్షించడమే మంచిదని సుదీర్ఘకాల అనుభవాల పరిశీలన వల్ల తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈమేరకు మూడు మార్గాలను గమనించారు. ట్యూమర్లను సర్జరీ ద్వారా తొలగించడం, రేడియేషన్ ట్రీట్‌మెంట్, రెగ్యులర్‌గా పర్యవేక్షించడం. ప్రోస్టేట్ క్యాన్సర్ చాలావరకు మెల్లగా పెరుగుతుంది. అందువల్ల ఇది బయటపడేసరికి చాలా సంవత్సరాల కాలం పడుతుంది. ట్రీట్‌మెంట్‌తో సంబంధం లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల మనుగడ 97 శాతం వరకు ఉండడం గమనించదగినదని డాక్టర్లు చెబుతున్నారు.
స్థానికీకరించిన క్యాన్సర్ గుర్తించిన పురుషులు ఆందోళన చెంది వెంటనే చికిత్సకు వెళ్లవలసిన అవసరం లేదని, చాలా తక్కువ సంఖ్య లోనే ఎక్కువ రిస్కు ఉన్నవారుంటారని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం భారత్‌లో మొత్తం మరణాల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ మరణాల రేటు 0.37 శాతం మాత్రమేనని తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి అధ్యయనంలో దేశం లోని మొత్తం క్యాన్సర్ మరణాల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ మరణాల రేటు 3 శాతం మాత్రమే ఉన్నట్టు బయటపడింది. 2020 లో 41, 532 ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వెలుగు లోకి వచ్చాయి. 2025 నాటికి ఈ సంఖ్య 47,000 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించి, నివారణకు చికిత్స తీసుకుంటే వీలైనంతవరకు రిస్కు ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన ప్రతి 41 మందిలో ఒకరికి మరణం సంభవిస్తోంది. ఈ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో బయటపడక పోవడం, త్వరగా దీన్ని గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి మరణానికి దారి తీస్తోంది. ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌నే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి వాల్‌నట్ (అక్రోట్ కాయ) పరిమాణంలో కటి భాగంలో బ్లాడర్ పక్కనే ఉంటుంది. ఇది వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్యాన్సర్ ప్రారంభ దశ దాటిందంటే ఎముకలు, ఇతర అవయవాలకు కూడా విస్తరిస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా వీర్యస్కలనం జరిగేటప్పుడు నొప్పిగా లేదా మంటగా అనిపిస్తుంది. రాత్రిపూట మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మూత్రాశయం నిండినా మూత్రాన్ని బయటకు విసర్జించ లేక పోతుంటారు. కటి భాగంలో వాపు, ఎముకల్లో నొప్పి, ఫ్రాక్చర్, స్వల్ప గాయాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మూత్రం లేదా వీర్యం ద్వారా రక్తం రావచ్చు.
నివారణ మార్గాలు
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తే ఈ క్యాన్సర్ రిస్కు తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు వంటివి ఆహారంలో ఎక్కువ శాతం ఉండేలా చూడాలి. రెడ్‌మీట్ తీసుకుంటే రిస్కు పెరుగుతుంది. వారంలో ఎక్కువ రోజులు ఎక్సర్‌సైజు చేయాలి. శరీరం బరవు పెరగకుండా చూసుకోవాలి. ఎక్సర్‌సైజు చేయలేకుంటే కనీసం మెల్లగానైనా నడక ప్రారంభించాలి. శరీరంలో క్యాలరీలు బాగా తగ్గించుకోవాలి. 50 ఏళ్లు దాటాక రెగ్యులర్‌గా రక్త పరీక్షలు ( పిఎస్‌ఎ టెస్ట్) అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఇది రక్తంలో పిఎస్‌ఎ స్థాయిలను లెక్కిస్తుంది. దీంతోపాటు మలపరీక్ష (డిఆర్‌ఇ) అవసరం. దీనివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలవుతుంది..