రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్న లబ్దిదారులు
మూడు వారాలు గడిచిన ఊసేత్తని అధికారులు
గ్రేటర్ మూడుజిల్లాల పరిధిలో 56వేలకుపైగా దరఖాస్తులు
వేసవి ముగిసిన తరువాత ప్రారంభిస్తామని రెవెన్యూ సిబ్బంది వెల్లడి
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ స్దలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు దరఖాస్తులు చేసుకున్న పేదలు రెగ్యులర్ కోసం స్దానిక రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసి మూడు వారాలు గడిచిన ఇప్పటివరకు వాటి గుర్తించి పట్టించుకునే నాథుడే లేడని నగర ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రభుత్వ స్దలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్దీకరించడానికి జీవో నెం. 58, 59 జారీ చేసి గడువు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. దీంతో స్దానిక ప్రజలు సమీపంలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు చేశారు. మొదటి జీవో నెంబర్లు 58, 59 విడుదల చేయగా దానికి అనుబంధంగా జీవో నెంబర్ 14 విడుదల చేసింది. ప్రభుత్వం 125 గజాల లోపు స్దలాల్లో నిర్మాణాలు చేసుకుంటే ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది.
250 గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఇళ్లకు 75శాతం అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్రస్దాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో దరఖాస్తులు పరిశీలించాల్సిన ఉంటుంది. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ స్దలాల్లో నిర్మాణాలు చేసుకున్నవారికి క్రమబద్దీకరణ ఎంతో ఉపయోగపడుతోంది. మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో మొదట్లో 1.65లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి 35 శాతానికి పడిపోయాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగ రంగారెడ్డిలో 31,830, మేడ్చల్‌లో 14,500, హైదరాబాద్ జిల్లాలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వేసవి కాలం ముగిసిన తరువాత ఇంటింటికి తిరిగి పరిశీలన చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఈసారి దరఖాస్తులు చేసిన వారి పట్ల అధికారులు నిర్లక్షం చేయకుండా వీలైనంత త్వరగా ఇళ్లను పరిశీలించి క్రమబద్దీకరణ చేయాలని బస్తీ సంఘాల నాయకులు కోరుతున్నారు. ధనవంతులకు సంబంధించిన ఇళ్లు విషయంలో చూపిన చొరవ, పేదల ఇళ్ల విషయంలో చూపడం లేదని మండిపడుతున్నారు. క్రమబద్దీకరణ తొందరగా చేస్తే బ్యాంకుల రుణాలు తీసుకుని కొత్త నిర్మాణాలు చేసుకుంటామని పేర్కొంటున్నారు.