మనతెలంగాణ/హైదరాబాద్ : ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ త్వరలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన కోర్టు తీర్పు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉండడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయినట్టుగా సమాచారం. అయితే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న, ప్రభుత్వం నిర్ణయించిన విలువల ఆధారంగా క్రమబద్ధీకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్‌లు సైతం వారం రోజులుగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుతం విలువలకు సంబంధించి నివేదికను తయారు చేస్తున్నట్టుగా తెలిసింది.
గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్క్రూటీని…
2020 సంవత్సరంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల పైచిలుకు దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన నిమిత్తం గత సంవత్సరం ప్రభుత్వం గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీ స్క్రూటీని సైతం పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వెనువెంటనే క్రమబద్ధీకరణను చేపట్టడానికి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం.
జిహెచ్‌ఎంసి పరిధిలో 14 లక్షల దరఖాస్తులు
గ్రామ పంచాయతీ పరిధిలో 10,69,555 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 10,48,239, కార్పొరేషన్‌లో 4,11,056 దరఖాస్తులు రాగా, మొత్తం 25,28,850 ఎల్‌ఆర్‌ఎస్ కింద 2020 సంవత్సరంలో దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. 25,28,850 లక్షల దరఖాస్తుల్లో సుమారుగా 14 లక్షల దరఖాస్తులు జిహెచ్‌ఎంసి పరిధిలోని నుంచే వచ్చాయని, ఆ తరువాతి స్థానం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే అనుమతులు లేని లే ఔట్లలో క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం 200 గజాల విస్తీర్ణం కలిగి ఉన్న ప్లాట్లు ఉన్నట్టుగా అధికారుల స్క్రూటీనిలో తేలింది.
రెండు ప్రక్రియలుగా విభజించి….
అయితే ప్రభుత్వానికి అందిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో అనుమతులు లేని లే ఔట్లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణ నిమిత్తం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్లాట్ల తనిఖీని అధికారుల కమిటీ పూర్తి చేసినట్టుగా తెలిసింది. అయితే దరఖాస్తుల పరిశీలన నిమిత్తం దరఖాస్తుల క్లస్టరింగ్ (గ్రూపులుగా విభజించడం), సైట్ ఇన్‌స్పెక్షన్ (స్థలాన్ని తనిఖీ చేయడం) రెండు ప్రక్రియలుగా వీటిని పూర్తి చేసినట్టుగా తెలిసింది. మొదటి దశలో గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించిన అధికారుల బృందం దరఖాస్తులతో పాటు ఆయా ప్లాట్లను తనిఖీ చేసినట్టుగా సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా 3 లక్షల దరఖాస్తులు…
రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను తనిఖీ చేసి రిమార్కులను ఆన్‌లైన్ నమోదు చేయగా దీనికోసం వివిధ విభాగాల అధికారులు పనిచేసినట్టుగా తెలిసింది. అయితే వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని అధికారుల బృందం పేర్కొన్నట్టుగా తెలిసింది. దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్ లిస్ట్ రూపొందించగా, లే ఔట్, ప్లాట్‌లు తనిఖీకి వెళ్లినప్పుడు అధికారుల బృందం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపినట్టుగా సమాచారం. అయితే ఎల్‌ఆర్‌ఎస్ నిమిత్తం వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనలను విరుద్ధంగా ఉన్నా క్రమబద్ధీకరణకు అర్హత లేని సుమారు 2 నుంచి 3 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే ప్రభుత్వం తిరస్కరించే దరఖాస్తులకు సంబంధించి రానున్న రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అన్ని రకాలుగా అర్హత కలిగిన దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.