Wednesday, January 22, 2025

బండికి నో బెయిల్

- Advertisement -
- Advertisement -

Rejection of Bandi Sanjay Bail Petition

14రోజుల జ్యూడిషియల్ కస్టడీ
నేడు హైకోర్టులో పిటిషన్?

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సంజయ్ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీష్‌కు ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండికి కోర్టు రిమాండ్ విధించింది. సంజయ్‌పై ఉన్న పది పాత కేసులను రెండో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై ఆయన తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం నాటి ఘటనలో 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ జిల్లా కారాగారానికి తరలించారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో విషయమై ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు కరీంనగర్‌లో దీక్షకు దిగారు. అయితే ఆదివారం అర్థరాత్రి బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండిని పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి బండి సంజయ్‌ని కరీంనగర్ పిటిసికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున కరీంనగర్ పిటిసి సెంటర్‌కు చేరుకుని కరీంనగర్ సిపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కరోనా నిబంధనలు అమలులో వున్న సమయంలో ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేసినట్లుగా కరీంనగర్ సిపి సత్యనారాయణ చెప్పారు. బండి సంజయ్ దీక్షా ప్రాంగణంలో మాస్క్ ధరించని 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా బండి సంజయ్ సహా మరో నలుగురికి బెయిల్ కోసం న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బండి సంజయ్ బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

బండిపై నాన్ బెయిలబుల్ కేసులు : సిపి సత్యనారాయణ

నిరుద్యోగ జాగరణ దీక్షను అడ్డుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్‌తో పాటు 16 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మొత్తంగా 70 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. బిజెపి నాయకులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సిపి తెలిపారు. 332,333,149,147 సెక్షన్‌తో పాటు 188 డిఎం 51b జివో నెంబర్ 1 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసులు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. తాము హెచ్చరిస్తున్నా వినకుండా బిజెపి నాయకులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోగా పోలీసులపైనే దాడి చేశారని తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయని సిపి సత్యనారాయణ తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే నిబంధనలను పాటించకపోవడం వల్లే ఎంపి సంజయ్‌ని అరెస్ట్ చేశామని సిపి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అరెస్టు జరిగిందని సిపి పేర్కొన్నారు.

 

బండి సంజయ్‌కు ప్రాణహాని..
జైల్లోనే చంపేందుకు కుట్ర :న్యాయవాది మృత్యుంజయ

 

మన తెలంగాణ/హై-దరాబాద్ ః తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నుండి ప్రాణహానీ ఉందంటూ బిజెపి సీనియర్ నాయకులు, న్యాయవాది కుటుకం మృత్యుంజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైలుకు వెళుతున్న సంజయ్‌ని అక్కడే హతమార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రాత్రి జాగరణ దీక్షను భగ్నం చేసి ఎక్కడికో తీసుకెళ్లిప పోలీసులు సోమవారం ఉదయానికి గాని తిరిగి కరీంనగర్‌కు తీసుకురాలేదు. ఏదో కుట్ర చేద్దామనే ఆలోచోనతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మృత్యుంజయం అనుమానం వ్యక్తం చేశారు. జైలులో అందించే ఆహారంలో విషం కలిపి సంజయ్ చేత తినిపించే ప్రమాదం వుందని బిజెపి నేత ఆందోళన వ్యక్తం చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు బండి సంజయ్‌కు ఇలా ప్రాణహాని తలపెట్టవచ్చని అనుమానాలు వున్నాయన్నారు. కాబట్టి జైల్లో సంజయ్‌కి ఆహారం ఇచ్చేటప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణ వుండేలా ఆదేశించాలని న్యాయమూర్తిని అభ్యర్థించినట్లు మృత్యుంజయ పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షులు బండి బెయిల్ కోసం మరోసారి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మృత్యుంజయ తెలిపారు. అలాగే సీనియర్ న్యాయవాదుల ద్వారా హైకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టులో హౌస్‌మోషన్ లేదా లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. 333 సెక్షన్‌ను తొలగించాలని స్కాప్ పిటిషన్ కూడా వేయనున్నట్లు కుటుకం మృత్యుంజయ వెల్లడించారు.

ఎంతవరకైనా పోరాడతా : బండి

ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని ఎంపి బండి సంజయ్‌కుమార్ ప్రకటించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి నేతలు సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యనేతలు పోలీసుల తీరును ఖండించారు.

బండి సంజయ్‌కు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్
కేసులకు భయపడొద్దని భరోసా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఫోన్ ద్వారా పరామర్శించారు. బండి సంజయ్‌కు జెపి నడ్డా ఫోన్ చేయగా.. బండి సంజయ్ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పక్షాన బండి చేస్తున్న పోరాటం భేష్ అని జెపి నడ్డా మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్ వెనుక జాతీయ నాయకత్వం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని తన మాటగా బండికి చెప్పాలని అన్నారు. పోరాటంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు. మరోవైపు బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడంపై జెపి నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం, లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ అమానుష తీరును ఖండించదగినదని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు.

అమిత్‌షా దృష్టికి తీసుకువెళతాం: లక్ష్మణ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బిజెపి ఓబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళతామన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. గ్యాస్‌కట్టర్, రాడ్లతో బిజెపి క్యాంప్ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టి బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని తెలిపారు. స్వయంగా పోలీసు కమిషనర్ సత్యానారాయణ తలుపులు పగులగొట్టారని లక్ష్మణ్ ఆరోపించారు.

బండి సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి 14 రోజులు రిమాండ్ విధించారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని ధ్వజమెత్తారు. రోజురోజుకు తెలంగాణలో బిజెపి బలోపేతమవుతోందని, అందుకే ఇలాంటి అణిచివేత కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని పేర్కొన్న లక్ష్మణ్.. స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కోవిడ్ రూల్స్‌కు అనుగుణంగానే బండి సంజయ్ జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. సంజయ్‌కు సంఘీభావం తెలుపుదామని నాయకులు వెళితే మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండిని అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు

ఉద్యోగుల సమస్యలపై జాగరణ దీక్ష చేపట్టిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు, బిజెపి శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణమేర్పడింది. దీనిపై ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుతగా శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్ సర్కారు అమానుషంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో పోలీసులను ఉపయోగించి బండిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన నేతలు, కార్యకర్తలు తగిన వైద్య చికిత్స తీసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ సోము వీర్రాజు ఉద్ఘాటించారు. పక్క రాష్ట్రంలోని జాతీయ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై దృష్టి పెట్టే ప్రాంతీయ పార్టీ నేతలు మొదట తమ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.

లోక్‌సభ స్పీకర్‌కు బండి లేఖ

లోక్‌సభ స్పీకర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరును లేఖలో వివరించారు. ‘పోలీసు కస్టడీ నుంచే మీకు లేఖ రాస్తున్నా, ఎంపి అయిన నాకు సిపి సత్యనారాయణ కనీస గౌరవం ఇవ్వలేదు.. కరీంనగర్ సిపి, ఇతర పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తూ బలవంతంగా నన్ను అరెస్టు చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల’ని ఆ లేఖలో బండి కోరారు.

అరెస్టులకు భయపడం.. ఉద్యోగుల పక్షాన పోరాడతాం
ఈటల, రఘునందన్, విజయశాంతి

అరెస్టులకు భయపడబోమని.. ఉద్యోగుల తరపున పోరాటం కొనసాగిస్తామని.. జీవో 317కు సవరణ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని బిజెపి ఎంఎల్‌ఎలు ఈటల, రఘునందన్, బిజెపి సీనియర్ నేత విజయశాంతిలు స్పష్టం చేశారు. తామంతా ఉద్యోగుల వెంటే ఉంటామని, నిర్బంధం, అక్రమ అరెస్టులు ఎక్కువ రోజులు సాగవని, బేషరతుగా బండి సంజయ్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే భయంతోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వర్గం వాళ్లు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి విషయానికి వచ్చేసరికే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా? అని నర్మగర్భంగా వారు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News