Saturday, February 22, 2025

ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

తొలిసారి ఎంఎల్‌ఏగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు మరి ఆరుగురు నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో దాదాపు 26 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్శిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమెకు బలమైన ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్నాయి. ఆమె 1992లోనే ఎబివిపి సభ్యురాలుగా చేరారు. హర్యానాలోని జులానాలో జన్మించిన ఆమె 32 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌తో మమైకమై ఉన్నారు. ఆమె ఢిల్లీ మాజీ సివిక్ కౌన్సిలర్ కూడా. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఏర్పాటుచేసిన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు, ఎన్‌డిఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహిళలో రేఖా గుప్తా నాలుగో వ్యక్తి. ఇదివరలో బిజెపికి చెందిన సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

దేశంలో ఎన్‌డిఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి రేఖా గుప్తా, కాగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీలో పురుష ఆదిక్యత మంత్రివర్గానికి మాజీ విద్యార్థి నాయకురాలైన రేఖా గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన దిగ్గజ నాయకుడు పర్వేశ్ వర్మ, హిందూత్వ పోస్టర్ బాయ్ అని చెప్పుకునే కపిల్ మిశ్రా, బిజెపిలోని సిక్కు నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా, ఇంకా ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సెనా వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. సిర్సా ఒక్కరే పంజాబీలో ప్రమాణస్వీకారం చేయగా, మిగతా అందరూ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.

కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తాను ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా అభినందించడమే కాక, ఆమె ఆధ్వర్యంలో ఢిల్లీ అన్ని విధాల అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా అనేక ర్యాలీలు, నిరసనలు చూసిన చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లోకి దాదాపు 50000 మంది ప్రమాణస్వీకారోత్సవాన్ని తిలకించడానికి చేరుకున్నారు. వేదిక ప్రదేశంను బంతిపువ్వులు, బంటింగ్‌లతో అలంకించారు. నృత్యం, సంగీతం, డ్రమ్‌బీట్‌లు, అనేక మంది బిజెపి జెండా ఊపుతూ, నినాదాలు చేస్తూండటంతో ఆ ప్రదేశం చాలా కోలాహలంగా కనిపించింది. కొందరైతే ‘జై శ్రీరామ్’ అని, ఇంకొందరు ‘మోడీ మోడీ’ అని, మరికొందరు ‘రామ్‌జీ కో కెహ్ దేనా, జై ఆర్య రామ్’ అనే నినాదాలతో హోరెత్తించారు.

ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ప్రముఖులలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఉన్నారు. ఇక హాజరైన కేంద్ర మంత్రుల్లో అమిత్ షా, బిజెపి చీఫ్ జెపి.నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, హర్దీప్ పూరీ, ఇంకా యూపీ ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రమాణస్వీకారోత్సవం ముగిశాక నూతన క్యాబినెట్ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు నగరంలోని లగ్జరీ హోటల్‌లో లంచ్‌కు వెళ్లారు.

ఇదిలావుండగా ప్రమాణస్వీకారోత్సవానికి ముందు రేఖా గుప్తా మహిళలకు నెలకు ఇస్తానన్న రూ. 2500 సాయం హామీని నెరవేరుస్తామని, గత పదేళ్లలో ఆప్ చర్యలకు జవాబుదారీని చేస్తామని అన్నారు. అర్హత ఉన్న మహిళలందరికీ మార్చి 8న మహిళా దినోత్సవం నాడు నెలనెలా ఇచ్చే ఆర్థిక సాయం తొలి విడతను అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని బిజెపి హామీ ఇచ్చిందన్నది ఇక్కడ గమనార్హం. కాగా రేఖా గుప్తా ముందు అనేక సవాళ్లు రెడీగా ఉన్నాయి. వాటిలో యమునా నదీ శుద్ధీకరణ ఒకటి. ఢిల్లీని కాలుష్య రహితం చేయడం మరొకటి. ఆప్ తాలూకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించడం ఇంకొకటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News