ఓ చిన్న కుర్రాడు..అతనికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పినట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగతి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
‘విమానం’ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్ సాంగ్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన పంథాంలో అద్భుతంగా పాటను ఆలపించారు. వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు.
వైవిధ్యంగా ప్రమోషనల్ కంటెంట్‌తో విమానం సినిమాపై బజ్ క్రియేట్‌చేస్తోంది టీమ్. అందులో భాగంగా ఇప్పటికే సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. అలాగే చిత్ర నిర్మాతలు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బహుమతులను కూడా అందిస్తామని ప్రకటించారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.