మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలుగు చలన చిత్ర రంగంలో రేలంగి హాస్యం అజరామరం అని టీటీడీ మాజీ జెయిఓ టి. సత్య నారాయణ రావు కొనియాడారు. 1960,70 దశకాల్లో ఏదైనా కొత్త సినిమా వస్తే, రేలంగి వున్నారా అని అడిగే వారు. ఆయన లేని సినిమాలు బహు అరుదు అన్నారు.మంగళ వారం సాగర్ రోడ్ షిర్డీ సాయి కాలనీ ఎస్. ఆర్.గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య నారాయణ రావు, రేలంగి చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనకటి తరంలో ఆయన సినిమాలు చూడని వారు లేరని ఆయనకు ఆయనే పోటీగా మూడు దశాబ్దాలు వెలిగారంటూ కీర్తించారు.
అంతే కాదు ఆయన గొప్ప మానవతా వాది అని, .ఎన్నో గుప్త దానాలు చేసిన వితరణ శీలి అని కొనియాడారు. సీనీయర్ సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాస మాట్లాడుతూ రేలంగి వీర అభిమానిగా ఈ సభలో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు..తాను పూంచ్ సెక్టార్ లో పని చేస్తున్న సందర్భంగా పలువురు సినీ నటులు సైన్యా న్ని కలిసి అభినందనలు తెలిపే వారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రేలంగి , రమణా రెడ్డి జోడీ నీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మరచి పోరన్నారు. నవ్వు ఇప్పుడు దివ్య ఔషధం గా డాక్టర్స్ నిర్దారించారన్నారు. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించగా, బిడిఎల్ స్వాగతం పలికారు. గాయకులు దినకర్ రేలంగి హాస్య గీతాలు వినిపించి అలరించారు. ఈకార్యక్రమంలో ఎస్.ఆర్.గ్రాండ్ ఎండిఎం.నరసింహా రెడ్డి, నటులు వెంకటేశ్వర్లు,చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.