Monday, December 23, 2024

కేంద్రం పెత్తనం దేశానికి ముప్పు

- Advertisement -
- Advertisement -

కేంద్ర, రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సంబంధాలను, ఇచ్చిపుచ్చుకొనే తీరును గమనించేవారిలో కొన్ని భయానుమానాలు చోటు చేసుకోడం సహజం. ఈ తీరు ఇలాగే సాగితే మున్ముందు ఘర్షణ వాతావరణం మరింత చిక్కబడే ప్రమాదం దాపురించవచ్చునని అనిపించక మానదు. అభివృద్ధిలో, సంక్షేమంలో ముందడుగులో గల దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రతిఫలం, వెనుకంజలో గల ఉత్తరాదికి ఎక్కువ ప్రయోజనాలు కలగడం బొత్తిగా హేతుబద్ధం కాని అసమ స్థితిని సృష్టిస్తున్నది. ఈ సరళిలో కేంద్రం పెత్తందారీతనం పెరిగిపోయి సహకార సమాఖ్య ఆలోచనకే ముప్పు వాటిల్లుతున్నది. పన్నుల రూపంలో కేంద్రానికి విశేషంగా చెల్లించే రాష్ట్రాలకు అక్కడి నుంచి అతి తక్కువ నిధులు రావడమనేదానిని సరిచేయకపోతే అటువంటి రాష్ట్రాల్లో అసంతృప్తి మరింతగా రగలకమానదు. అలాగే పాలనలో, పథకాల అమలులో మెరుగ్గా వున్న రాష్ట్రాలకు భవిష్యత్తులో కీడు కలగనున్నదనే అభిప్రాయానికి అవకాశం కలగడం మంచి చేయదు.

దేశాభివృద్ధి కృషిలో చొరవతో పని చేయాలన్న ఉత్సాహంపై అది చన్నీళ్ళు కుమ్మరిస్తుంది. 2019 ఫిబ్రవరిలో 15వ ఆర్థిక సంఘం ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు అప్పటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక అధికారాల పంపిణీ విషయంలో కేంద్రం పట్ల గణనీయమైన పక్షపాతంతో రాజ్యాంగాన్ని ఆమోదించారని, అది చాలక ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల పరిధిలోని అంశాల్లోకి విపరీతంగా చొచ్చుకు వస్తున్నదని అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రాలపై అసంఖ్యాకంగా రుద్దుతున్నదని, రాష్ట్రాల జాబితా నుంచి పలు అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చుతున్నదని, రాష్ట్రాల పరిధిలోని అంశాల విషయంలో వాటితో సంప్రదించకుండానే కొత్త పథకాలను చేర్చుతున్నదని అన్నారు. ఇలా చేయడం ద్వారా కేంద్రం ఒక హెడ్మాస్టర్‌గా రాష్ట్రాలు అణిగిమణిగి వుండే విద్యార్థుల్లా మారిపోయిన సంగతి కళ్ళముందున్న కఠోర వాస్తవమే.

ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నట్టు నీతి ఆయోగ్‌ను నెలకొల్పడంతో జాతి అభివృద్ధి కృషిలో, సహకార ఆర్థిక సమాఖ్య విధానాన్ని పెంపొందించడంలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణిస్తూ టీం ఇండియాను నిజంగానే నిర్మిస్తారనే ఆశలు కలిగాయి. ఇటీవల కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించిన సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అందరం కలసి టీం ఇండియాగా పని చేద్దామని అన్నారు. కాని ఆచరణలో అది బొత్తిగా రుజువు కావడం లేదు, సరికదా కేంద్రం నిరంకుశత్వం రోజురోజుకీ పెరిగిపోతున్నది. నిధుల పంపిణీలో ఇది స్పష్టంగా రుజువవుతున్నది. కేంద్రం తాను వసూలు చేసే ప్రతి పైసా రాష్ట్రాలతో పంచుకోవలసి వుండగా, సెస్సు మార్గంలో దొడ్డిదారిలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తూ దానిని తానే అనుభవించే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. అలాగే తాను మితిమించి రుణాలు చేస్తూ రాష్ట్రాలు సహేతుకమైన అభివృద్ధి కృషికి అప్పు చేయబోతే అడ్డుకొనే దుష్ట పాత్రను పోషిస్తున్నది.

ఇది అంతిమంగా ప్రజలతో నేరుగా వ్యవహరించవలసిన రాష్ట్రాల చేతులు కట్టివేసి అభివృద్ధి, సంక్షేమాలు రెండూ దెబ్బతినే పరిస్థితిని సృష్టిస్తుంది. 201415 నుంచి 2020 21 వరకు గల కాలంలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ. 3,65,797 కోట్లు కేంద్రానికి వెళ్లగా, కేంద్రం తెలంగాణకు కేవలం రూ. 1,68,647 కోట్లు మాత్రమే విదిలించింది. అలాగే ఆర్థిక సంఘాలు కేటాయించే వనరుల్లో రాష్ట్రాలకు చెందవలసిన నిధులను తొక్కిపెట్టడం కేంద్రానికి అలవాటైపోయింది. కేంద్ర పన్నుల నుంచి 41% రాష్ట్రాలకు రావలసి వుండగా, అది సెస్సుల మార్గంలో ఆదాయం చేసుకోడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రాలు 25% వాటాను కూడా పొందడం లేదని బోధపడుతున్నది. లీటరు పెట్రోల్ మీద కేంద్రం 27% సెస్సు వసూలు చేస్తున్నది. అలాగే డీజెల్ మీద సెస్సు కింద రూ. 21 వసూలు చేస్తున్నది. ఇందులో రాష్ట్రాలకు పైసా వాటా రాదు. ఇంకొక వైపు భవిష్యత్తులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి వున్నది.

జనాభా నియంత్రణ చర్యలు తీసుకోనందుకు ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పొందనుండగా, కుటుంబ నియంత్రణను శ్రద్ధతో పాటించి జనాభా భారాన్ని తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు లభిస్తాయి. ఈ ఘోర అన్యాయం పట్ల ఇప్పటి నుంచే దక్షిణాది రాష్ట్రాలు నిరసన కంఠాన్ని బిగ్గరగా వినిపించవలసిన అవసరం వుంది. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా సమానాధికారాలను, అవకాశాలను కలిగి వుండాలి. వాస్తవానికి కేంద్రం దేశ రక్షణాది కొద్ది విధులకే పరిమితం కావాలి. కాని అందుకు విరుద్ధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిధులను, అధికారాలను కూడా అమితంగా స్వాహా చేస్తున్నది. అది చాలక ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ స్థితి దేశ ఉన్నతికి, సమైక్యతకు ఎంత మాత్రం దోహదపడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News