బెర్లిన్: జర్మనీకి చెందిన డ్యూషె వెల్లె టీవీ చానల్‌లో పని చేస్తున్న ఓ అఫ్ఘన్ జర్నలిస్టుకోసం వేట సాగించిన అఫ్ఘన్‌లోని తాలిబన్లు ఆయన బంధువును కాల్చి చంపినట్లు ఆ చానల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో పని చేస్తున్న ఆ జర్నలిస్టు కోసం ఉగ్రవాదులు ఇల్లిల్లూ సోదాలు నిర్వహించినట్లు సంస్థ గురువారం తెలిపింది. జర్నలిస్టుకు చెందిన మరో బంధువు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డాడని, అయితే మిగతా వారు తప్పించుకున్నారని తెలిపింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి అంతకు మించి వివరాలను ఆ చానల్ తెలపలేదు. ఈ హత్యను ఆ టీవీ చానల్ డైరెక్టర్ జనరల్ పీటర్ లింబర్గ్ తీవ్రంగా ఖండిస్తూ, అఫ్ఘనిస్థాన్‌లో మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఎంత ప్రమాదం ఉందో ఈ సంఘటన చాటుతోందని అన్నారు. తాలిబన్లు ఇప్పటికే కాబూల్‌లో, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టుల కోసం ఒక ప్రణాళిక ప్రకారం సోదాలు నిర్వహిస్తునన్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. తమ సంస్థకు చెందిన మరో ముగ్గురు జర్నలిస్టుల ఇళ్లపైనా తాలిబన్లు దాడులు జరిపినట్లు కూడా డ్యూషె వెల్లె తెలిపింది.