ఏడేళ్ల కారాగార శిక్ష నిందితులను అరెస్టు చేయొద్దు : కొవిడ్ విజృంభణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య అనూహ్య రీతిలో పెరుగుతున్న దృష్ట్యా ఖైదీలతో క్రిక్కిరిసి ఉన్న కారాగారాలపై సుప్రీంకోర్టు శనివారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది బెయిల్ లేదా పెరోల్ లభించిన ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలు(హెచ్‌పిసి) గత ఏడాది మార్చిలో బెయిల్ మంజూరుకు అనుమతించిన ఖైదీలందరినీ మళ్లీ హెచ్‌పిసిల అనుమతి కోసం నివేదించకుండా వెంటనే విడుదల చేయాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ఆదేశించింది.
తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పెరోల్ మంజూరు చేసిన ఖైదీలందరికీ మళ్లీ 90 రోజుల పెరోల్‌పై విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏడేళ్ల గరిష్ఠ కారాగార శిక్ష ఉన్న కేసులలో నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయవద్దని కూడా మరో కేసు తీర్పును ప్రస్తావిస్తూ ధర్మాసనం అధికారులను ఆదేశించింది. జాతీయ న్యాయ సేవా సంస్థ మార్గదర్శకాలను అనుసరించి తాజాగా మరి కొందరు ఖైదీలను విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని హెచ్‌పిసిలను ధర్మాసనం ఆదేశించింది.