12వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల
న్యూఢిల్లీ: పిఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 12వ విడతగా రూ. 16,000 కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విడుదల చేశారు. దాదాపు 11 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ మొత్తం పంపిణీ జరుగుతుంది. దీంతో ఇప్పటివరకు రైతులకు ఈ పథకం రూ. 2.16 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పించినట్లయింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పిఎం–కిసాన్) కింద అర్హులైన రైతులకు ప్రతి మూడు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందచేస్తోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ డబ్బు జమ అవుతుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభం కాగా 2018 డిసెంబర్ నుంచే ఇది అమలులోకి వచ్చింది. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరుగుతున్న రెండు రోజుల పిఎం– కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022లో ప్రధాని నరేంద్ర మోడీ 12వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ పిఎం కిసాన్ ప్రయోజనాలు లబ్ధిదారులకు మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్ల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. 12వ విడత నిధులు దీపావళి పండుగకు ముందే రైతులకు చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.