Monday, January 20, 2025

ఖరీఫ్ సీజన్‌కు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విడుదల

- Advertisement -
- Advertisement -
జోన్లవారీగా సాగు రకాలు ఎంపిక
పత్తిసాగుకు ఈ నెల 20వరకే డెడ్‌లైన్
అంతర పంటగా కంది సాగు ఎంపిక
మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు
కందికి ఆగస్ట్ 15వరకూ అదను
వరిసాగులో స్వల్పకాలిక రకాలకు పాధాన్యం

హైదరాబాద్:  ఖరీఫ్‌లో తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రణాళికు రూపొందించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నేలల స్వభావం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి శాస్త్రవేత్తలతో కంటింజెన్సీ క్రాప్ ప్లానింగ్ రిపోర్టును తయారు చేయిచించింది. ఇందులో ఉత్తర తెలంగాణ పరిధిలోని జిల్లాలను నార్త్‌జోన్ కింద చేర్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాలను సౌత్‌జోన్ కింద చేర్చింది. మిగిలిన జిల్లాలను సెంట్రల్ జోన్ కింద చేర్చింది. ఈ వర్షాకాలం ఇప్పటి వరకు కురిసిన వర్షపాతాన్ని ఇందుకు ప్రధాన అంశంగా ఎంచుకున్ని దీన్ని జోన్ల వారీగా డివిజన్ చేసింది. ఈ సీజన్‌లో ఆలస్యంగా పంటలు సాగు చేసే రైతులకు పలు సూచనలు చేసింది. పత్తిసాగుకు ఈ నెల 20తో అదను కాలం ముగిసి పొతుందని వెల్లడించింది. కంది సాగుకు ఆగస్ట్ 15వరకూ అదను ఉందని ప్రకటించింది. వరిసాగులో ఆర్‌ఎన్‌ఆర్ వంటి స్వల్పకాలిక రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
నార్త్‌జోన్ పరిధిలో..
నార్త్ జోన్ పరిధిలో అదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ , మంచిర్యాల , నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి కామరెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను చేర్చింది. ఈ జోన్ పరిధిలో ప్రధానంగా వరి, పత్తి , సోయాబీన్ మొక్కజొన్న , పొద్దుతిరుగుడు, కంది, శనగ, చెరకు, పసుపు ప్రధాన పంటలుగా సాగులోకి రావాల్సివుంది. ఈ జోన్‌పరిధిలో అధిక వర్షాలు అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలను సూచించింది. ఈ సీజన్‌లో వరి సాగు చేయదలిచిన రైతులు మధ్యకాలిక రకాల వరినార్లు జూన్ 30లోపే పోసుకోవాలని , స్వల్పకాలిక రకాలు జులై 15లోపే నారుమళ్లు పోసుకోవాలని సూచించింది. ఈ నెల చివరి వరకూ ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం వరి నార్లు పోసుకోవాలని సూచించింది. పత్తి సాగు చేయదలిచిన రైతులు ఈ నెల 20లోపు విత్తనాలు వేసుకోవాలని తెలిపింది. బోదెల పద్దతిలో పత్తి నాటుకోవాలని సూచించింది. పత్తిలో అంతర పంటలుగా కంది సాగు చేసుకుంటే అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపింది. సోయాబీన్ పంట దిగుబడి తగ్గకుండా ఉండాలంటే జులై తొలివారంలోనే విత్తనం వేసుకోవాలని తెలిపింది. ఆలస్యం అయ్యే కొలది దిగుబడి తగ్గుతుందని వెల్లడించింది. పైర్లు బెట్టకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే బెట్టకు గురైన పైర్లను కాపాడుకునేందుకు స్ప్రే అప్లికేషన్ పద్దతులు పాటించాలని తెలిపింది. మొక్కజొన్న సాగు చేయదలిచిన రైతులు జులై 15 తర్వాత స్వల్పకాలిక విత్తన రకాలు ఎంపిక చేసుకోవలని తెలిపింది. అదికూడా నీటి ఆధారం ఉన్న ప్రాంతాల్లోనే ఈ పంటసాగును ఎంపిక చేసుకోవాలని సూచించింది. కంది సాగు చేసే రైతులు జులై 15నుంచి ఆగస్ట్ 15 వరకూ 130150రోజుల్లో పంట చేతికి వచ్చే స్వల్పకాలిక రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జొన్న , మొక్కజొన్న , వేరుశనగ, ఆముదం , కంది , పెసర , మినుము , సోయాబీన్, పత్తి సాగు చేసిన రైతులు లేత పైర్లతో వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విధంగా తగు మోతాదులో సస్యరక్షణ చర్యలు పాటించాలని వెల్లడించింది.
దక్షిణ తెలంగాణ జోన్:
దక్షిణ జోన్ పరిధిలో వికారాబాద్ ,మేడ్చెల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ , గద్వాల, నారాయణపెట్ జిల్లాలను చేర్చిచింది. ఈ జోన్ పరిధిలో వరి సాగు చేయదలిచిన రైతులు జులై చివరి వరకూ స్వల్పకాలిక రకం కింద ఆర్‌ఎన్‌ఆర్ 15048 విత్తనంతో నారుమళ్లు పోసుకోవాలని సూచించింది. పత్తి సాగు రైతులు జులై 20వరకూ బోదె పద్దతిలో పత్తి విత్తనం వేసుకోవచ్చని తెలిపింది. అంతర పంటగా కంది విత్తుకోవచ్చని సూచించింది. కంది పంటసాగుకు ఆగస్ట్ 15వరకూ స్వల్పకాలిక రకం విత్తనం వేసుకోవచ్చిన వెల్లడించింది. మొక్కజొన్న సాగుకు జులై 15తర్వాత విత్తనం వేసే రైతులు వర్షాధారంగా 90రోజుల పంటకాలం ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ జోన్ పరిధిలో ఇప్పటికే వరి, జొన్న, మొక్కజోన్న, వేరుశనగ, ఆముదం, కంది, పెసర ,మినుము, సోయాబీన్ ,పత్తి సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది.
సెంట్రల్ జోన్:
ఈ జోన్ పరిధిలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి ,ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలను చేర్చింది. ఈ జోన్ పరిధిలో అత్యధికంగా వరిసాగులోకి రానున్నట్టు వెల్లడించింది. రైతులు ఈ నెలాఖరు వరకూ వరినార్లు పోసుకోవచ్చని తెలిపింది. అయితే ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. పత్తిసాగుకు జులై 20వరకూ అదను ఉన్నట్టు తెలిపింది. అంతరపంటగా కందిని ఎంపిక చేసుకోవాలని తెలిపింది. మొక్కజొన్న సాగు రైతులుజులై 15 తర్వాత స్వల్పకాలిక రకాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలని వెల్లడించింది. కందిసాగుకు ఆగస్ట్ 15 వరకూ గడువు ఉందని అయితే స్వల్పకాలిక రకాలు ఎంపిక చేసుకోవాలని సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News