రెండో దశ ఎన్నికల బిఎస్‌పి అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో : ఉత్తరప్రదేశ్ రెండో దశ ఎన్నికల కోసం బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఆదివారం 51 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈసారి ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా ప్రకటించిన 51 మంది అభ్యర్థుల్లో 23 మంది ముస్లింలే కావడం గమనార్హం. బీఎస్పీ ఇప్పటివరకు రెండు దశల ఎన్నికల కోసం 109 మంది అభ్యర్థులను ప్రకటించగా, వారిలో 39 మంది ముస్లింలే ఉన్నారు. ఫలితంగా మైనారిటీ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో 13 మంది ఒబిసిలు ఉండగా, వారిలో అత్యధికులు జాట్ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే 10 మంది దళితులు, ఉన్నత వర్గాలకు చెందిన ఐదుగురు ఉన్నారు. తొలిదశ ఎన్నికల కోసం ప్రకటించిన జాబితాలో 16 మంది ముస్లింలు ఉండగా, రెండోదశలో ఏకంగా 23 మందిని మాయావతి బరిలోకి దింపారు.